Vijayawada News: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణాలపై కమిటీ విచారణ జరిపి మంగళవారం నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్  ప్రకాశం బస్టాండ్ నుంచి బస్సును బయటకు నడిపే క్రమంలో గేర్ తప్పుగా వేయడంతో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడానికి కారణమైన డ్రైవర్ ప్రకాశంపై సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. అలాగే శాఖా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించించారు.


అలాగే డ్రైవర్ ప్రకాశం విధులను పర్యవేక్షించడంలో విఫలమైన ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వీవీ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేశారు. శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి తెలిపారు. 


ముగ్గురిని బలితీసుకున్న బస్సు
విజయవాడలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉండగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు - 2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్ (18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడు మృతి చెందాడు.


రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్
బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి 11, 12 ప్లాట్ ఫాంల వద్ద రెయిలింగ్ తో పాటు, ప్లాట్ ఫైం ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా బస్సు పైకి రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


సీఎం దిగ్భ్రాంతి
బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 


మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
ఈ ఘటన దురదృష్టకరమని, బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులున్నారని, బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు.