Vijayawada ACB Court On Chandrababu: 


ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. మరికాసేపట్లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. లేక రాత్రి సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం సైతం ఉంది.


తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది. చంద్రబాబుకు రిమాండ్ అని తీర్పు రాగానే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. టీడీపీ శ్రేణులు ధర్నాలు, రాస్తోరోకోకు ప్లాన్ చేస్తున్నారు.


అంతకుముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో నేటి ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సరికాదన్నారు. ఒకవేళ ఆ సెక్షన్‌ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 


మరోవైపు సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. 2021లో కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడంపై, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని సైతం కోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు రిమాండ్‌ రిపోర్ట్‌లో పొందుపరిచామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. రూ.271 కోట్ల స్కిల్ స్కామ్ అని కోర్టుకు తెలిపారు. కీలకమైన 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దీనిపై ఇరు పక్షాలు వాదనలు వినిపించగా.. పలుమార్లు న్యాయమూర్తి విరామం తీసుకోగా ఎట్టకేలకు వాదనలు ముగిశాయి. కాగా, అవినీతి ఆరోపణలతో చంద్రబాబు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి.


చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలిలా..
శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరారు. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం అన్నారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. 


కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు
చంద్రబాబు కేసులో తీర్పు వెలువడనున్న సమయంలో ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నారు. తీర్పు వెలువడిన అనంతరం చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు పోలీసులు. టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా ఏసీబీ కోర్టు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జిల్లాల్లో టీడీపీ నేతలు, శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.