Chandrababu Lawyer Sidharth Luthra:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టులో వాదించిన సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా కీలకాంశాలు మేజిస్ట్రేట్ ఎదుట ప్రస్తావించారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది. కానీ ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. కనుక అదే సమయాన్ని చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పరిగణించాలని లూథ్రా కోర్టును కోరారు. రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే అన్నారు.
సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు
లూథ్రా లేవనెత్తిన అంశాలివే.. ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు. ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. కానీ సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?. కోర్టులో ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు. సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు’ అని కోర్టుకు విన్నవించారు.
చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదని ఆరోపణలు
సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును లూథ్రా కోరారు. చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం కాగా, ఇది అనుబంధ పిటిషన్ మాత్రమేనన్నారు. కనుక రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలని వాదనలు వినిపించారు. అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించారు సిద్దార్థ్ లూథ్రా. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు.
సెక్షన్ 409 అంటే ఏమిటి..
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం.. ఎవరైనా, ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే, లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే, జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలుశిక్ష విధిస్తారు. ఇదే విషయంపై జరిమానా కూడా విధిస్తారు.
సాధారణ వివరణ ప్రకారం IPC 409 ప్రభుత్వోద్యోగి లేదా వారి వృత్తిలో ఆస్తిని అప్పగించిన వారు (బ్యాంకర్, వ్యాపారి, న్యాయవాది మొదలైనవి) నిజాయతీగా ఆ నమ్మకాన్ని ఉల్లంఘిస్తే, వారికి జీవిత ఖైదు లేదా పది సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాతో పాటుగా శిక్ష వేస్తారు. చంద్రబాబు హయాంలో చేసిన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రూ.271 కోట్ల స్కామ్ జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు.