ఏపీలో రాజకీయ సమీకరణాలు రెండు రోజుల్లో వేగంగా మారిపోయాయి. గతంలో టీడీపీతో కలసిపోరాడాలన్న జనసేనాని అభిప్రాయాన్ని ఆ పార్టీలోనే చాలామంది వ్యతిరేకించారు. టీడీపీతో కలిస్తే నష్టం అని, సొంతగా పోటీ చేయాల్సిందేనని అధినేతకు విన్నవించుకున్నారు. అయినా కూడా అంతిమ నిర్ణయాన్ని పవన్ కే వదిలేశారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. చంద్రబాబుకి మద్దతుగా జిల్లాల నుంచి టీడీపీ నేతలతోపాటు, జనసేన నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు. చంద్రబాబుకి మద్దతు తెలిపారు.
పవన్ ని అడ్డుకోవడంతో..
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో టీడీపీకి పోటీగా మెసేజ్ లు పెట్టారు, వైసీపీని ట్రోల్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ ని ఏపీకి రాకుండా పోలీసులు చేసిన ప్రయత్నం వారిలో మరింత కసి రాజేసింది. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన జనసేన నేతలు, తమ నాయకుడి విషయంలో కూడా తేడా జరిగే సరికి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఏపీకి రావాలంటే ప్రత్యేక అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. పవన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని అన్నారు. ఏపీకి వస్తూ, పవన్ రోడ్డుపై పడుకున్న సీన్ కూడా జనసైనికుల్లో బలంగా నాటుకుపోయింది. ఒకరకంగా సీఎం జగన్.. చంద్రబాబు, పవన్ ఇద్దర్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని జనసైనికులు నమ్ముతున్నారు. జగన్ పై ద్వేషం పెంచుకుంటున్నారు.
టీడీపీతో కలసివెళ్తేనే..
ఇప్పటికిప్పుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే జనసేనకు పెద్దగా మేలు జరగదనే విషయం అందరికీ తెలుసు. అయితే టీడీపీతో పొత్తుకు వెళ్తే వాళ్లు ఇచ్చే సీట్లతో సర్దుకోవాలి. పొత్తు లేకుండా సొంతగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభం చేకూర్చినట్టవుతుంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయంలో పార్టీ క్యాడర్ కి సర్దిచెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అంత విశదీకరించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. జనసైనికులకు కూడా సీన్ అర్థమైంది. చంద్రబాబుపై వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రేపు పవన్ కల్యాణ్ పై కూడా ఇలాగే కక్షసాధిస్తారని అంటున్నారు జనసైనికులు. పవన్ ని ఏపీకి రాకుండా అడ్డుకోవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో జట్టుకట్టాలనుకుంటున్నారు జనసైనికులు.
టీడీపీతో కలసి వెళ్లాలనేది ఇన్నాళ్లూ జనసేనాని ఆలోచనగానే ఉండేది, కానీ ఇప్పుడది జనసైనికుల ఆలోచనగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు పార్టీకి, నేతలకు నష్టం చేకూరుస్తుందని వారు డిసైడ్ అయ్యారు. ఒంటరిపోరు జనసేనకు కాస్తో కూస్తో లాభం చేకూర్చినా, అంతిమంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, వైసీపీకి పెద్ద లాభం జరుగుతుందని అంటున్నారు. అందుకే చంద్రబాబు అరెస్ట్, పవన్ అడ్డగింతను అవకాశంగా తీసుకుని, రెండు పార్టీలు ఉమ్మడిపోరుకి సిద్ధమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకరకంగా టీడీపీ, జనసేన మధ్య అపోహలు తొలగిపోయి, జట్టుకట్టడానిక సీఎం జగన్ ఓ అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతోంది. మరి పవన్ నిర్ణయం ఎలా ఉందో చూడాలి. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండే సరికి పవన్ త్వరగా పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని కూడా జనసైనికులు భావిస్తున్నారు. ఆ దిశగా పవన్ నుంచి ప్రకటన ఉంటుందేమో చూడాలి.