బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి సండే సందడి మొదలయ్యింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. మామూలుగా బిగ్ బాస్‌లో సండే అంటే ఫన్‌డే. ఈ ఫన్‌డే కూడా కంటెస్టెంట్స్‌తో ఎన్నో ఆటలు ఆడించడానికి నాగార్జున సిద్ధమయ్యారు. కంటెస్టెంట్స్ కూడా ఎంతో హుషారుగా ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తి చూపించారు. అందుకే ప్రోమో అంతా చాలా సరదాగా అనిపిస్తోంది. ముందుగా సండే అంటే ఫన్‌డే అని తెలుసు కదా అని నాగార్జున.. కంటెస్టెంట్స్‌ను అడగడంతో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది.


సండే ఫన్‌డే..
బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత కూడా కిరణ్ రాథోడ్.. తెలుగు నేర్చుకోవడం లేదని నాగార్జున అనడంతో రోజుకు ఒక కొత్త పదం అయినా నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే సండే నాగార్జున రాగానే.. ‘తిన్నారా, బాగున్నారా’ అని అడిగితే.. ‘ఇవి నిన్ననే అడిగేశావు’ అన్నారు నాగార్జున. దీంతో ఏం చేయాలో తెలియక కిరణ్ రాథోడ్ నవ్వుతూ నిలబడింది. సండే సందర్భంగా ఈ రోజు చాలా ఆటలు ఆడబోతున్నామని, అందులోని ప్రతీ ఆటలో ఆడపిల్లలు వర్సెస్ మగపిల్లలు అని నాగార్జున వివరించారు. ముందుగా మగపిల్లల నుండి ఆడడానికి ఎవరు వస్తున్నారు అని నాగ్ అడగగానే.. అందరూ కలిసి టేస్టీ తేజ చేయిలేపారు. ఇంక వేరే దారి లేక తేజ రంగంలోకి దిగాడు. కళ్లకు గంతలు కట్టుకొని చేతిలోని బొమ్మ పాముతో అమ్మాయిలను కొట్టాలి అన్నది ఆట. అమ్మాయిలు కూడా అదే చేయాలి. ఆ ఆట ఆడుతున్న క్రమంలో తేజ కింద పడిపోవడం అందరి చేత నవ్వులు పూయించింది.


శుభశ్రీ ఆటతో నవ్వులే నవ్వులు..
టేస్టీ తేజ తర్వాత అమర్‌దీప్ రంగంలోకి దిగాడు. తను ఒక అమ్మాయిని కూడా కొట్టకముందే టైమ్ అయిపోయింది. టైమ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలంతా వెనక్కి వెళ్లిపోతున్నారు అంటూ అమర్‌దీప్ సాకులు చెప్పాడు. ఇది విన్న నాగార్జున ‘ఆడలేక మద్దెలు ఓడు’ అనే సామెతను అమర్‌దీప్‌కు గుర్తుచేశారు. అమ్మాయిల్లో ముందుగా శుభశ్రీ టర్న్ వచ్చింది. ఒక్కరిని కూడా వదలకూడదు అన్నట్టుగా రంగంలోకి దిగింది శుభశ్రీ. కళ్లకు గంతలు కట్టిన క్షణం నుండి అటు, ఇటు పరుగులు తీస్తూ చేతిలో ఉన్న పాముతో దొరికిన వారిని కొట్టడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లి గోడకు కూడా తగిలింది. అబ్బాయిలను మాత్రమే కాదు అమ్మాయిలను కూడా రెండు దెబ్బలేసింది. శుభశ్రీ ఆట చూసి ప్రేక్షకులంతా నవ్వుకున్నారు. 


శోభా శెట్టిపై మీమ్..
ఆటలు ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అదే సమయంలో కొన్ని మీమ్స్ చూపిద్దామంటూ నాగార్జున మొదలుపెట్టారు. ముందుగా శోభా శెట్టిపై ఒక మీమ్ వచ్చింది. ‘శోభా శెట్టి విత్ రీల్ డాక్టర్ బాబు. రియల్ డాక్టర్ బాబు’ అంటూ మీమ్ వచ్చింది. అందులో శోభా శెట్టితో పాటు గౌతమ్ కృష్ణ ఫోటో ఉంది. అది చూసి కంటెస్టెంట్స్ అంతా పడి పడి నవ్వుకున్నారు. సండే ఫన్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశం మొదలయ్యింది. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చేతికి ఒక చిన్న శవపేటిక ఇచ్చి అందులో అస్థిపంజరం ఉంటే వారు అన్‌సేఫ్ అని, పువ్వులు ఉంటే సేఫ్ అని చెప్పారు. ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయాన్ని ప్రోమోలో చూపించకుండా మ్యానేజ్ చేశారు.



Also Read: రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial