వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై వంగవీటి కుటుంబం మాత్రం స్పందించటం లేదు.


వంగవీటి కుటుంబం నుండి మరో నేత...
విజయవాడ మాజీ శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం పై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటి వరకు వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వంగవీటి రాధా కూడా శాసన సభ్యుడిగా విజయం సాధించారు. ఆ తరువాత నుండి ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు. 


వంగవీటి కుటుంబం నుండి రాజకీయ నాయకులు..
వంగవీటి మోహన రంగా పేరు మీద ఆయన కుటుంబం నుండి చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా హత్యలు తరువాత బెజవాడ రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్దానం ఏర్పడింది. ఆయన కుటుంబం నుండి శోభనా చలపతిరావు, వంగవీటి నరేంద్ర, వంగవీటి శంతన్ వంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ప్రస్తుం వంగవీటి నరేంద్ర మాత్రమే భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు.


వంగవీటి బ్రాండ్...
వంగవీటి ...ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి మెదలయిన వంగవీటి మోహన రంగా రాజకీయం జీవితం, ఆ తరువాత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను శాసించే స్థాయికి వెళ్ళాయి. అయితే ఆ తరువాత వంగవీటి మోహన రంగా దారుణ హత్య తరువాత రాజకీయం ఒక్క సారిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన కుటుంబం నుండి ఆయన కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నప్పటికి, ఆయన రాజకీయ వారసులిగా ఆశాను పాలిటిక్స్ లోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని అంటున్నారు.


తెలుగు దేశం కు చెక్ పెట్టేందుకేనా...
వంగవీటి ఆశా ను రాజకీయాల్లోకి తీసుకు రావటం ద్వార తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్ట వచ్చనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని అంటున్నారు. వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేయించింది తెలుగు దేశం పార్టీ హయాంలోనే అనే ఆరోపణ ఉంది. అయితే అదే పార్టీలోకి వంగవీటి రాధా వెళ్ళటం చాలా మందికి ఇష్టం లేదు. అలాంటి పరిస్దితులను తమకు అనుకూలంగా మార్చుకోవటం తో పాటుగా తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్టాలన్నా, రంగా అభిమానులను తమ వైపుకు తిప్పుకోవాలన్నా, కూడా ఆశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా తీసుకు రావాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.


వంగవీటి ఫ్యామిలి నుండి రెండో మహిళ..
జరుగుతున్న ప్రచారానికి అనుగునంగా వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తే, ఆ కుటుంబం నుండి రెండో మహిళగా ఆమెకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.  వంగవీటి మోహన రంగా హత్య తరువాత ఆయన సతీమణి రత్న కుమారి రాజకీయాల్లోకి వచ్చి, రెండు సార్లు విజయవాడ శాసన సభ్యురాలిగా కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆశా కూడా రాజకీయాల్లోకి రావటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.