ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, వైఎస్ఆర్ సీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. టీడీపీ లీడర్లు సెల్ఫీ ఛాలెంజ్ విసరగా, అందుకు దీటుగా వైఎస్సార్ సీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు రెండు పార్టీల నేతలు సిద్ధం అయ్యారు. దీంతో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరువూరు పట్టణంలో ఆంక్షలు విధించారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా టీడీపీ నేతలు, వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడికక్కడ బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం నుండి చర్చకు సిద్ధం అంటూ బోసుబొమ్మ సెంటర్ కి వస్తున్న వైఎస్ఆర్ సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ సీపీ గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు బోసుబొమ్మ సెంటర్‌కు వస్తుండగా పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, టీడీపీ నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య సహా పలువురిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు బొద్దకోళ్ల ప్రేమరాజు, పట్టణ బీసీసెల్ అధ్యక్షుడు మీనుగు శ్రీనివాసరావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి (Kokkiligadda Rakshana Nidhi) మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. రూ.14 వందల కోట్లతో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినా వారికి కనపడదని అన్నారు. డయాలసిస్ సెంటర్లు నిర్మిస్తున్నామని, సీఎం సభకు వచ్చిన జనాన్ని చూశాక టీడీపీ పని అయిపోయిందని వారికి అర్థం అయిందని అన్నారు.
తాడిపత్రిలోనూ టీడీపీ - వైఎస్ఆర్ సీపీ ఉద్రిక్తత
పెన్నా నదిలో ఇసుక తరలింపుల వ్యవహారం మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించగా, ఆయన బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెద్దపప్పూరు మండలంలోని పెన్నానదిలో ఇసుక తరలింపుల పరిశీలనకు వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని నిర్బంధం చేశారు. బారీకేడ్లు ఉంచి ఆయన నివాసం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అడ్డు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలను, ఇంకొంత మంది నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హౌస్ అరెస్టు నుంచి తప్పించుకున్న జేసీ, రోడ్డుపై నిరసన
ఎట్టకేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై నుంచి తప్పించుకొని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై కూర్చున్నారు. ఈ క్రమంలోనే జేసీకి, ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ జేసీ కింద పడిపోయారు.