Gudivada Election Result 2024 | గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పై దాడికి యత్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు రువ్వారు, కోడి గుడ్లు విసిరేసి రచ్చరచ్చ చేశారు. అంతటితో ఆగకుండా కొడాలి నాని ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేయగా, తెలుగు తమ్ముళ్లను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు యువతను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. 


కొడాలి నాని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల సంబరాలు 
మొదట కోడిగడ్లు విసురుతున్నప్పుడు వారిని అడ్డుకోలేకపోయిన పోలీసులు ఆ తరువాత స్పందించారు. కొడాలి నాని ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన సమయంలో మాత్రం టీడీపీ శ్రేణులను పోలీసులు వారించి అడ్డుకున్నారు. తెలుగు తమ్ముళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు కొడాలి నాని ఇంటి ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై తెలుగుదేశం, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.


అసలేం జరిగిందంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొన్ని రోజుల కిందట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఆయనతో పాటు పార్టీ దారుణ వైఫల్యాన్ని చవిచూసింది. ఈ క్రమంలో కొడాలి నాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. కాసేపు జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసిన పార్టీ కార్యక్తలు ఆపై కొడాలి నాని ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ నేత ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించగా వన్ టౌన్ సీఐ శ్రీనివాస్, పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా బలవంతంగా కొడాలి నాని ఇంట్లోకి వెళ్లేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోగా కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 






ఇంట్లోకి చొరబడకుండా అడ్డుకున్నందుకు పోలీసులు, తెలుగు యువత మధ్య వాగ్వాదం జరిగింది. కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు జై చంద్రబాబు అంటూ అక్కడ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, సినిమా ముందు ఉందని పొట్లూరి దర్శిత్ అన్నారు. 


రాజకీయ సన్యాసం అన్నావ్.. ఏమైందంటూ టీడీపీ శ్రేణులు ఫైర్


చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని చాలెంజ్ చేసిన వైసీపీ నేత కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని సూచించారు. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా అన్నారు. ఎన్నికలకు ముందు మాట్లాడుతూ.. బొచ్చు పీకుతారా అన్నావ్ వచ్చి మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరొస్తారో రండి అని అప్పట్లో రెచ్చగొట్టావు కదా, ఇప్పుడు తెలుగు యువత వస్తేనే ఇంట్లో దాక్కున్నావ్.. నీ బతుక్కి చంద్రబాబు రానవసరం లేదని పొట్లూరి దర్శిత్ వ్యాఖ్యానించారు.