Amaravathi News: ఏపీలో తెలుగుదేశం(Telugu Desam) పార్టీ అఖండ విజయంతో అమరావతి(Amaravati) రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయో లేదో...సీఆర్డీఏ(CRDA) అధికారుల్లో ఇలా చలనం వచ్చింది. దాదాపు ఐదేళ్లుపాటు అతీగతీ లేకుండా ఉన్న అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేయించింది. పిచ్చిమొక్కలు తొలగించింది. ఇన్నాళ్లు దుమ్ము కొట్టుకుపోయిన రాజధాని సీడ్‌ ఏక్సాస్‌రోడ్డును ఊడ్చి శుభ్రం చేస్తుండటంతో అద్దంలా మెరిసిపోతోంది. అటు రాజధాని మహిళలు సైతం జగన్‌ను మాస్‌ ర్యాగింగ్ చేసి ఆటపట్టిస్తున్నారు


ఎన్నాళ్లకెన్నాళ్లకు....
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన అమరావతి రాజధాని ప్రాంతం...వైసీపీ(YCP) పాలనలో వెలవెలబోయింది. వేల కోట్లరూపాయలతో నిర్మించిన భవనాలు, రోడ్లను జగన్ గాలికి వదిలేయడంతో కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటం...తెలుగుదేశం(Telugu Desam) పార్టీ అఖండ మెజార్టీ సాధించడంతో ఒక్కసారిగా సీఆర్‌డీఏ(CRDA) అధికారుల్లో భయం మొదలైంది. చంద్రబాబు(Chandrababu) ఇంకా ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేయకముందే సిబ్బంది మేల్కొన్నారు. ఐదేళ్లపాటు కనీసం అటువైపు కన్నెత్తి చూడని పారిశుద్ధ్య సిబ్బంది తెల్లవారుతుండగానే ఉరుకులు, పరుగులు పెట్టారు.


ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపనం చేసిన ప్రాంతంలో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. గాలికి, వానలకు దుమ్ముకొట్టుకుపోయిన ఆ ప్రాంతాన్ని తిరిగి అద్దంలా మార్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సీడ్‌యాక్సిస్ రోడ్డును సైతం ఊడ్చి శుభ్రపరుస్తున్నారు. విద్యుత్ సిబ్బంది ఆ మార్గంలో వెలగని లైట్లకు మరమ్మతులు చేపట్టారు. ఇన్నాళ్లు జీతాలు ఇవ్వకపోడంతో  రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పని మానేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.


రాజధాని రైతులు ధర్నాలు చేసి, నిరసనలు తెలిపి, విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయినా....కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని సీఆర్డీఏ(CRDA) అధికారుల్లో ఒక్కరోజులోనే ఇంతమార్పు రావడం చూసి రాజధాని రైతులే ఆశ్చర్యపోతున్నారు. ఇక తమకు దిగులు లేదని....అమరావతి(Amaravathi)ని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబే(Chandrababu) చూసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమకు పండుగ వచ్చిందని....పిల్లల భవిష్యత్‌పై బెంగ తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మహిళలు మాస్‌ ర్యాగింగ్‌
రాజధాని ప్రాంత రైతుల బాధలు, కష్టాలు చెప్పుకునేందుకు ఎన్నో వందలసార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా....కనీసం ఆయన తమను చూడడానికి కూడా ఇష్టపడలదేని, పరదాల చాటున వెళ్లిపోయేవారని రాజధాని మహిళలు తెలిపారు. సీఎంగా ఉండగా ఎలాగూ తమ గోడు వినలేదని...కనీసం ఇప్పుడు సామాన్య ఎమ్మెల్యేగా అయిన తమ బాధలు తెలుసుకుంటారేమోనంటూ  రాజధాని మహిళలు అరటిపండ్లు, స్వీట్లు తీసుకుని గురువారం ఆయన నివాసానికి వచ్చారు. ఆయన చొరవ వల్లే తమలో ఉన్న శక్తిసామర్థ్యాలు బయటకు వచ్చాయని...ఇంట్లో ఉండి గరిటె తిప్పే మాకు ఉద్యమాలు చేసే స్థాయికి పెంచారంటూ ఎద్దేవా చేశారు. ఆయన స్వీట్లు, పండ్లు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటామంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం సుమారు గంటసేపు వేచిచూసినా...అనుమతి రాకపోవడంతో స్వీట్లు, పండ్లు పోలీసులకు  ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. అమరావతి మహిళల శాపం వల్లే జగన్ ఓడిపోయారని వారు మండిపడ్డారు