Sri Sarada Peetham RajaShyamala Yagam: విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని సీఎంకు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని సూచించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో స్వాత్మానందేంద్ర స్వామి వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.
ప్రతి ఏటా మాఘ మాసం పంచమి నుంతి దశమి వరకు..
ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం (Sri Sarada Peetham) వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శారదా పీఠం రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇదే ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ యాగాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా ఈ ఉత్సవాలు చేశారు. కేవలం ఏపీ సీఎం జగన్ ఒక్కరినే ఆహ్వానించారు. శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలా దేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా
రాజశ్యామలా యాగంలో పాల్గొనే ముందు సీఎం జగన్ విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. రాజశ్యామలా దేవి యాగంలో సీఎం వైఎస్ జగన్ తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్ కు సత్సంబంధాలు
విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో సీఎం జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా పీఠంలో జరిగే కార్యక్రమాలకు జగన్ ప్రత్యేకంగా హాజరవుతూ ఉంటారు. పీఠంతో ప్రత్యేకమైన అనుబంధం సీఎం జగన్‌కు ఉన్నందున ఆయను మాత్రమే వీఐపీని ఆహ్వానిచామని శారదాపీఠాధిపతి స్వరూపానంద కూడా మీడియాకు చెప్పారు. ఈ క్రమంలోనే ఈసారి జరిగే రాజశ్యామలా దేవి యాగానికి కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి జగన్ ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.