Supreme Court Judgement On Chandrababu SLP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ( Skill Development Case)లో టీడీపీ (TDP)అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Suprem Court) తీర్పు ఇవ్వనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేశారంటూ పిటిషన్‌లో తెలిపారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం... తుది తీర్పు ఇవ్వనుంది.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు...సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై మంగళవారం తీర్పు వెల్లడించనుంది.


గతేడాది అక్టోబరులో ఎస్ఎల్పీపై విచారణ


చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది సెప్టెంబరు 22న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. SLPLని త్వరగా విచారణకు స్వీకరించాలని సెప్టెంబరు 25న ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థలూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు వెళ్లారు. 27న జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ వైదొలగడంతో వాదనలు కొనసాగలేదు. దాంతో సిద్ధార్థలూథ్రా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు వెళ్లి కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. తొలిసారి ఈ కేసు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చిన తీర్పు...ఎట్టకేలకు మంగళవారం వెలువడనుంది. 


స్కిల్ డెవలప్ మెంట్ కేసు వివరాలు


చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.