మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 35వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు సైతం సమ్మె కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా ఏపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. అంబేడ్కర్ జంక్షన్ లో రోడ్లపై ముగ్గులు వేసి, రంగు రంగుల ముగ్గుల రూపంలో తమ సమస్యలను రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  కూడలిలో ముగ్గులు వేసి నిరసనకు దిగారు. 35 రోజులుగా ఆందోళన చేస్తున్నా వేతనాలు పెంచలేదని, తమ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించడం లేదని ముగ్గుల రూపంలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తమను పండుగ కూడా జరుపుకోనివ్వడం లేదన్నారు అంగన్వాడీలు. పండుగ రోజున ఇంట్లో కాకుండా, తమను నడిరోడ్డుపైన ఉండేలా చేసిన జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం అన్నారు. 


దీక్షా శిబిరాల వద్దే అంగన్వాడీలు వంటా వార్పు 
కృష్ణా, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో అంగన్వాడీలు దీక్షా శిబిరాల వద్దే అంగన్వాడీలు వంటా వార్పు చేశారు. నందిగామలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆందోళన శిబిరం వద్దే పండుగ సందర్భంగా పొంగలి వండి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని.. వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోవడంతో పండుగ రోజు కూడా రోడ్ల మీదకు వచ్చి దీక్షలు చేయాల్సి వస్తోందన్నారు. 


మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. 
రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే పలు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఎన్నికల తరువాత జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అంగన్వాడీల పలు డిమాండ్లను నెరవేర్చిందని, రెండు మూడేళ్లకు ఓసారి జీతాల పెంపు సాధ్యం కాదని.. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వేతనాలను ప్రభుత్వం పెంచుతుందని చెప్పడం తెలిసిందే.