కృష్ణాజిల్లా పెనమలూరుకి చెందిన ఓ మహిళను ప్రేమ పేరుతో ఎస్సై మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కలిసి తిరిగి చివరకు మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. 


బాధితురాలి ఫిర్యాదు చేసిన 12 గంట‌ల్లోనే పోలీసులు కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన అటు పోలీసు వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఎస్ ఐ చేసిన మోసంపై బాధితురాలు మచిలీపట్నం దిశ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దిశ పోలీసులు కేసు న‌మోదు చేసుకొని రికార్డు స‌మ‌యంలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.


పెనమలూరుకు చెందిన 27 ఏళ్ల మహిళ, ఎస్‌ఐ విశ్వ‌నాథప‌ల్లి గణేష్ క్లాస్‌మేట్స్. బీటెక్‌ నుంచే పరిచయం ఉంది. మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా మళ్లీ కలిశారు. నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ఇద్దరి పర్సనల్‌ విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆమె ఫ్యామిలీలో ఉన్న గొడవలు గురించి అప్పుడే తెలుసుకున్నాడు ఎస్సై గణేష్. ఆమె భర్తతో ఉన్న విభేదాలు కారణంగా ఆమెకు దగ్గరయ్యాడు. 


భర్తతో గొడవలు ఉన్నందున రెండో పెళ్లి చేసుకోవడం కుదరని ఆమెతో చెప్పాడు ఎస్సై. భర్త నుంచి విడాకులు తీసుకుంటే మరో పెళ్లికి వీలు అవుతుందని సలహా ఇచ్చాడు. తానే చేసుకుంటానంటూ కలరింగ్ న‌మ్మించాడు. ఎస్సై మాటలకు పూర్తిగా పడిపోయిందామె. ఎస్సై తనకు కొత్త లైఫ్ ఇస్తారనుకొని కలలు కనింది. 


ఎస్సై మాటలు నమ్మిన ఆ బాధితురాలు భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. తనతో అప్పటి వరకు క్లోజ్‌గా ఉన్న ఎస్సై దూరం జరిగాడు. కొద్ది రోజుల తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. పెళ్ళి విష‌యం అడిగిన‌ప్పుడ‌ల్లా గణేష్ ఆమెను దూరం పెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. ఎన్నిసార్లు అడిగినా పెళ్ళి చేసుకునేందుకు గణేష్ ముందుకు రాలేదు.


అప్పటికి గాని బాధితురాలికి అసలు విషయం తెలియరాలేదు. పెళ్లి సంగతిని దాట వేసి తనతో ఆడుకుంటున్నాడని అర్థమైన బాధితురాలు... గణేష్‌ను నిలదీసింది. పెళ్లి చేసుకుంటావా పరువు తీయమంటావా అని గట్టిగాని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఎస్సై గణేష్‌ తాను పోలీసునని.. డిపార్టమెంట్‌ మొత్తం తనకు అండగా ఉంటుందన్నాడు. ఆమెను బెదిరింపుల‌కు గురి చేశాడు.


అయితే ఉన్న‌తాదికారులు, న్యాయ‌వాది స‌హ‌కారంతో బాధితురాలు పోలీసు శాఖ‌లోని ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జోక్యం చేసుకున్నారు. ఎస్ఐతో మాట్లాడారు. ఇద్ద‌రిని కలిపేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే గ‌ణేష్ మాత్రం స‌సేమిరా అన్నాడు. చివ‌ర‌కు క‌నిపించ‌కుండా పారిపోయాడు.


దీంతో బాధితురాలు ఈ విష‌యాన్ని ఉన్న‌తాదికారుల దృష్టికి తీసుకువెళ్లింది. వాళ్ల సూచనతో దిశ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎస్‌సి , ఎస్‌టి యాక్ట్ కింద కేస్ నమోదు చేశారు. 12గంటల్లో నిందితుడైన ఎస్ఐ గ‌ణేష్ ను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో  7 రోజుల‌్లో దర్యాప్తు ముగించి.. చట్టపరంగా బాధితురాలికి రావాల్సిన పరిహారం ఇప్పిస్తామ‌ని తెలిపారు.