NIA Rides: ఛత్తీస్ గఢ్ ఎన్ఐఏ అధికారుల సోదాలతో బెజ‌వాడ‌లో ఒక్క సారిగా క‌ల‌క‌లం రేగింది. ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ.. ఇందుకు సంబందించిన స‌మాచారాన్ని మాత్రం బయటకు రానీయలేరు. అలాగే టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ నేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అనారోగ్య కారణాలతో విజయవాడలో చికిత్స కోసం వెళ్లిన ఆర్కే భార్య శిరీష ఇంటి తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


పోలీసులతో ప్రజా సంఘాల నేతల చర్చలు..


అయితే ఇటు బెజ‌వాడ‌లో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విరసం నేతలపై కొద్ది రోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్‌నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ప్రభాకర్ ఇంటి చుట్టూ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా ప్ర‌జా సంఘాలు కూడా ఆందోళ‌నకు దిగాయి. ప్రస్తుతం పోలీసులతో ప్రజా సంఘాల నేతలు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.


ఆందళనను విరమించమంటున్న పోలీసులు..


ప్రజా సంఘాల నేతలు వెంటనే ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు. ఎన్ఐఏ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి తనిఖీలు చేయడం ఏంటని.. దివంగత మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో లేకపోతే తాళాలు పగులగొట్టి ఇంటిని సోదా చేయడాన్ని తప్పుబట్టారు. ఎన్ఐఏను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్ర‌జా సంఘాలు త‌ల‌పెట్టే ఉద్య‌మాలపై అన‌వ‌స‌రంగా అదికారులు దాడులు చేయ‌టం, వేధింపుల‌కు గురి చేయ‌టంపై వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. 


దివంగత మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష...


దివంగత మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ... తనకు ఆరోగ్యం బాగాలేక విజయవాడఆస్పత్రికి వెళ్లానని.. అదే సమయంలో వచ్చిన ఎస్ఐఏ అధికారులు తన ఇంటి తాళాలు పగులగొట్టి మరీ తనిఖీలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మీ ఇంట్లో నలగురు తల దాచుకున్నారని సమాచారం వచ్చిందని.. అందుకే తనిఖీలు చేశామని చెప్తున్నారని మండిపడ్డారు. సరైన సమాచారం లేకుండా, అది కూడా నేను ఇంట్లో లేనప్పుడు ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఐఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


ప్రజా వ్యతిరేక శక్తులపై పోరాడుతుంటే.. గొంతు నొక్కుతున్నారు


దివంగత మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీశ ఇంట్లో నలుగురు మావోయిస్టులు తల దాచుకున్నారని సమాచారం వస్తేనే.. తనిఖీలు చేపట్టామని ఎన్ఐఏ అధికారులు చెబుతు్నారు. అంతే కాకుండా మావోయిస్ట్‌ల దగ్గర డంప్‌ స్వాదీనంలో కొంత మంది విరసం నేతల పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీటిపై స్పందించిన విరసం నేతలు... ఎన్ఐఏ అధికారులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని వివరించారు. తాము మావోయిస్టులకు డబ్బులు పంపిచడం ఏంటన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాటికైనా కుళ్లిపోయిన సమాజంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్నారు.