Vijayawada Floods: ఇప్పుడంటే వరదలతో విలవిలలాడుతున్న బెజవాడను చూస్తున్నాం. ఈ విపత్తు జల ప్రళయంగా మారకుండా కాపాడిన ప్రకాశం బ్యారేజ్ గురించీ చెప్పుకుంటున్నాం. కానీ ఇదే ప్రాంతంలో ఒకప్పుడు వ్యవసాయానికి నీరు అందక ఏర్పడ్డ కరవు లక్షల మందిని చంపేసింది అని విన్నారా. దాని కారణంగానే విజయవాడ, గుంటూరు మధ్య ప్రకాశం బ్యారేజ్ ఏర్పడింది అని తెలుసా!
బ్రిటీష్ ప్రభుత్వాన్నే భయపెట్టిన డొక్కల కరవు
బ్రిటీష్ హయాంలో ఇంకా కృష్ణమ్మపై బ్యారేజ్ ఏర్పడక ముందు వచ్చిన నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వెళ్ళిపోయేదే. నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కాదు. అప్పటికే చారిత్రకంగా పాలనాపరంగా విజయవాడ, గుంటూరు చాలా పెద్ద పట్టణాలు. అలాంటి సమయం అంటే 1832-33 సంవత్సరాల్లో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కరవు ఏర్పడింది. అంతకు ముందు ఏడాది 1831లో భారీ వర్షాలు కురిసి రైతుల పంటను సర్వ నాశనం చేశాయి. ఆపై ఏడాది భీకర తుపాను వచ్చి వ్యవసాయాన్ని దెబ్బ తీసింది.
Also Read: బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్
వరుసగా రెండేళ్లు పంట నాశనం కావడంతో రైతులకు విత్తనాలు దొరకలేదు. పైగా బ్రిటీష్ వాళ్ల పన్నుల వసూళ్లు జనం దగ్గర ఉన్న కొద్ది డబ్బునూ ఖాళీ చేశాయి. అటు పంటలూ లేక ఇటు డబ్బూ పోయి ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన కరవు ఏర్పడింది. ఈ కరవు ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ప్రజల దగ్గర తినడానికి తిండి లేక శరీరం కుంగిపోయి ఎముకలు ఎండిపోయి డొక్కలు బయటకు కనపడేవి. అంటే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అప్పుడు ఉండేదన్నమాట. అందుకే దీనికి డొక్కల కరువు అని తరువాతి కాలంలో పేరు పెట్టారు .
గుంటూరులోనే 2 లక్షల మంది మృతి
ఈ డొక్కల కరవు కారణంగా ఒక్క గుంటూరు ప్రాంతంలోనే రెండు లక్షల మంది చనిపోయినట్టు నాటి రికార్డ్స్ చెబుతున్నాయి. అందుకే ఈ కరవుకు గుంటూరు కరువు అని కూడా పేరు. ఆ ఏరియాలో అప్పటి జనాభా 5 లక్షలు. వారిలో ఏకంగా రెండు లక్షల మంది కరవు కారణంగా తిండి లేక చనిపోయారు. కృష్ణా నదిలో నీళ్ళు ఉన్నా వాడకోలేని పరిస్థితి .
డొక్కల కరవు కాలంలో జనానికి తిండి లేక ఏది దొరికితే అది తినేవాళ్లు. ప్రమాదకరమైన ముళ్ళ చెట్ల కాయలను కూడా తిని ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ కరవు ప్రభావం విజయవాడ గుంటూరు పై మాత్రమే కాకుండా చెన్నై వరకూ వ్యాపించింది. విజయవాడ - చెన్నై రహదారిపై ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనపడేవి అంట.
ఈ కరవు కలిగించిన దుష్ఫలితాలు ఆ తరువాత 20 ఏళ్ల పాటు ఆ రెండు పట్టణలపైనే కాకుండా ఆంధ్ర ప్రాంతంపై కూడా పడింది. ఇవన్నీ నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి కాబట్టి దాని ఆదాయం సగానికిపైగా దెబ్బతిన్నది అని బ్రిటీష్ రాతల్లో స్పష్టంగా ఉంది .
Also Read: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి, కౌంటర్ వెయిట్స్ ఫిక్స్ చేసిన కన్నయ్యనాయుడు
కరవు ఫలితం -బ్యారేజ్ నిర్మాణం.
ఈ కరవు దెబ్బతో మరోసారి ఇలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి నీరు నిల్వ చేసుకోవడమే మార్గం అని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది. దీంతో గుంటూరు విజయవాడ మధ్య ఒక బ్యారేజ్ కట్టాలని నిర్ణయించింది. అప్పటికే గోదావరిపై బ్యారేజ్ నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాటన్ సూచనలతో ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ కు కాస్త ఎగువన బ్యారేజ్ నిర్మించారు. ఇది 1853లో 1132 మీటర్ల పొడవుతో 1.49 కోట్ల రూపాయల ఖర్చుతో మొదలై 1854లో పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కాటన్ శిష్యుడు మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు. బ్యారేజ్ నుంచి 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీరు వ్యవసాయ భూములకు అందేది. వందేళ్ళ పాటు సేవలందించిన ఆ ప్రాజెక్ట్ 1952లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది .
1957లో అందుబాటులోకి వచ్చిన ప్రకాశం బ్యారేజ్
బ్రిటీష్ వాళ్ళు కట్టిన బ్యారేజ్ కొట్టుకు పోవడంతో 1954లో అప్పట్లో కొత్త ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. విజయవాడ సీతానగరం మధ్య కట్టిన ఈ బ్యారేజ్ పై 1957 డిసెంబర్ 24న రాకపోకలు మొదలయ్యాయి. పాత ప్రాజెక్ట్ కంటే ఈ ప్రాజెక్ట్ కాస్త పొడవు ఎక్కువ. దీని లెంగ్త్ 1223 మీటర్లు. 70 గేట్లతో రెడీ అయిన ఈ ప్రాజెక్ట్ ఏకంగా 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2.78 కోట్లు ఖర్చు అయ్యింది.
ఆంధ్ర రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గౌరవార్థం ప్రకాశం బ్యారేజ్ అని దీనికి పేరు పెట్టారు. నాటి నుంచి విజయవాడను భారీ వరదల నుంచి కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ భూములను కరవు నుంచి కాపాడుతూ వస్తోంది.