బెజ‌వాడ‌లో 112 ఏళ్ళ నాటి గ్రంథాల‌యం నేటికీ విజ్ఞాన సంప‌ద‌ను పంచుతోంది. అదే రామ్మోహన్ గ్రంథాలయం.. వందేమాతర ఉద్యమానికి ముందే అవతరించిన ఈ గ్రంథాల‌యం తరాలుగా విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ బెజవాడలో తనకంటూ, ప్రత్యేకతను చాటుకుంటోంది. విజయవాడ అంటే దుర్గ గుడి, ప్రకాశం, గాంధీ పర్వతంతోపాటుగా రామ్మోహన్ గ్రంథాలయం కూడా ఆ రోజుల్లో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచింది. కాల‌క్రమంలో సాంకేతిక‌త పెరిగిపోవ‌టంతో, ఇప్పుడు ఆ గ్రంథాల‌యం చ‌రిత్రకు సాక్ష్యంగా నిలిచింది.


స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని రగల్చడంతోపాటు గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్, గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్ర బిందువుగా రామ్మోహ‌న్ గ్రంథాలయం ప్రసిద్ది చెందింది. రామ్మోహన్ ధర్మ పుస్తక భాండాగారంగా, రామ్మోహన్ ఉచిత లైబ్రరీ, రీడింగ్ రూమ్‌గా కూడ పిలిచేవారు.112 ఏళ్ల చరిత్ర కలిగిన రామ్మోహన్ గ్రంథాలయంలో వివిధ విభాగాలకు సంబంధించి 20 వేలకుపైగా పుస్తకాలున్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలే ఏడు వేలకుపైగా ల‌భిస్తాయి. దినపత్రికలు, వ్యక్తిత్వ వికాసం, తెలుగు, ఆంగ్ల నవలలు, వాణిజ్యం, అర్ధశాస్త్రం, చరిత్ర, భౌగోళిక, జీవ జంతు శాస్త్రాలు, మహిళలు, బాలల కోసం ప్రత్యేక విభాగాలు ఇక్కడ ఉన్నాయి. జ్యోతిష, ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలకు కూడా ఇది నెలవు. ప్రముఖ రచయితలు, ప్రఖ్యాత పత్రికా సంపాదకులు. పరిశోధకులు ఇలా ఎందరో ఇక్కడి విజ్ఞాన వీచికల్లో భాగ‌స్వాములు అయ్యిన వారే.


ఆ పేరు ఎలా వ‌చ్చింది...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు బెజవాడలోని కొందరు సాహిత్యాభిమానుల కృషితో తొలుత సత్యనారాయణపురంలో రామ్మోహన్ గ్రంథాలయం ఆవిర్భవించింది. బ్రహ్మసమాజ ప్రచారకులు, ఇప్పగుంట కృష్ణయ్య, కోల్‌కతాకు చెందిన బాబూ హేమచంద్ర సర్కార్, లండన్‌లోని బ్రిటిష్, ఫారిన్ యూనిటేరియన్ సంఘం, పుస్తకాలతో ఆర్థిక పుస్తక బాండాగారం పేరుతో 1903 ఏప్రిల్ నెలలో గ్రంథాల‌యం వెలసింది. గ్రంథాలయ భవనం అవసరాల మేరకు సరిపోకపోవడంతో వందేమాతర ఉద్యమంతో 'ప్రేరేపితులైన కొందరు యువకులు ఈ గ్రంథాల‌యాన్ని, ఇప్పుడున్న ప్రదేశానికి త‌ర‌లించారు. తన ఉపన్యాసాలతో దేశాన్ని ప్రభావితం చేసిన రాజా రామ్మోహన్ రాయ్ గౌరవార్ధం రామ్మోహన్ గ్రంథాలయంగా మార్చారు.


యువకుల ఉత్సాహం, దీక్ష ఈ గ్రంథాలయ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి. అయ్యంకి వెంకటరమణయ్య కార్యదర్శిగా ఎన్నిక కావడంతో గ్రాంథాల‌యం దశ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న బందరు రోడ్డులోని 2197 చదరపు గజాల స్థలాని బెజవాడ పురపాలక సంఘం వేలంలో రూ. 3,324 పాడారు. అయితే సొమ్ము చెల్లించడానికి కార్యకర్తల దగ్గర డబ్బు లేదు.. దీంతో అయ్యంకి వెంకటరమణయ్య ,సూరి వెంకటనరసింహ శాస్త్రితో పాటుగా మ‌రి కొంద‌రు క‌ల‌సి చందాలు పోగేసి, అప్పుచేసి స్థలాన్ని స్వాధీనం ద‌క్కించుకున్నారు.


గాంధీ మహాత్ముడి విడిది చేసింది ఇక్కడే...
1913లో గ్రంథాల‌య‌ భవనానికి శంకుస్థాన జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా విజయవాడలో పర్యటించిన మహాత్మా గాంధీ, మూడు సార్లు ఈ  గ్రంథాలయాన్ని సందర్శించారు. తొలిసారి 1918 జనవరి 30న విజయవాడ వచ్చిన గాంధీ ఈ గ్రంథాలయానికి వ‌చ్చారు. 1831 మార్చి 31న జాతిపిత అధ్యక్షతన విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది ఈ చారిత్రక భవనంలోనే. 1929లో కూడా ఇదే భవనంలో స్వాతంత్య్రోద్యమకారుల్ని ఉద్దేశించి గాంధీజీ ప్రసంగించారు. జాతిపిత తన మొదటి రెండు పర్యటనల్లో ఈ భవనంలోనే బస చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి,ఆచార్య ఎన్జీ రంగా, మాడపాటి హనుమంతరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు వంటి మ‌హామ‌హులు ఈ  గ్రంథాలయాన్ని సందర్శించారు.


విజయవాడలో వెలసిన అనేక సంస్థలు, సంఘాలు, సాగిన ఉద్యమాలకు ఈ గ్రంథాలయమే కేంద్ర స్థానంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ భాండాగార ప్రతినిధుల తొలి సమావేశం చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆధ్యక్షతన 1914 ఏప్రిల్ 10 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే జరిగింది. ఆ సందర్భంగా పురుడు పోసుకున్న దేశంలోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఇప్పటికి సేవలందిస్తోంది. 2013లో ఈ సంఘం వందేళ్ల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంది. 1917లో రాయడం వెంకట శివుడు ఈ గ్రంథాలయంలో తొలిసారిగా బాలల విభాగాన్ని ప్రారంభించారు. ఈ గ్రంథాలయం కేంద్రంగా అయ్యంకి వెంకటరమణయ్య తన ప్రజా జీవితాన్ని దేశానికి అంకితం చేశారు.


నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా....
ప్రస్తుతం సాంకేతిక ప‌రిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడకు వ‌చ్చే యువ‌త‌కు ఉచితంగా ఇంట‌ర్ నెట్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. దీని ద్వార సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన విజ్ఞానం నేటి త‌రానికి అందించేందుకు కూడ నాటి నుంచి నేటికి ద‌శాబ్దాలుగా ఈ గ్రంథాల‌యం సేవ‌ల‌ను అందిస్తోంది.