Palla Srinivasa Rao AP TD Chief: అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం (జూన్ 16న) రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీచేసిన పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో చంద్రబాబుకు పల్లాపై మరింత నమ్మకం పెరిగింది. తాజాగా అప్పగించిన నూతన బాధ్యతలు ఆయన విజయవంతంగా నిర్వహిస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు.


ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లోకి వెళ్లడంతో మరో నేతలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పాలని చంద్రబాబు భావించారు.


రాష్ట్రంలోనే రికార్డు మెజార్టీ సాధించిన పల్లా 
మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి 95 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత మంత్రి అయ్యారు. పార్టీని నడిపించాలంటే యువనేతకు ఛాన్స్ ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండేలా పల్లా పూర్తి స్థాయిలో పనిచేయాలని అధినేత ఆదేశించినట్లు సమాచారం. 


 



2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి పల్లా శ్రీనివాసరావు ఓటమి చెందారు. అనంతరం టీడీపీలో చేరిన పల్లా 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించారు. ఓటమి తరువాత విశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీలో తనదైన ముంద్ర వేసుకున్నారు. ఆయన ఆస్తులపై వైసీపీ నేతలు దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా తట్టుకుని నిలబడ్డారు. వైసీపీలోకి వస్తే మేయర్ పదవి అని ఆఫర్ చేశారని సైతం ప్రచారం జరిగింది. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన పల్లా.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పై రికార్డు స్థాయిలో మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.