Vijayawada Latest News: విజయవాడలో వరద ప్రభావం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపులో ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులతో మంత్రులు మాట్లాడారు. ఆహారం పంపిణీ, తాగు నీటి సరఫరాపై బాధితులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుడమేరుకు వరద ముప్పు నుంచి తప్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లుగా నారాయణ చెప్పారు.
సింగ్ నగర్ చుట్టుపక్కల బుడమేరు వరద క్రమంగా తగ్గుతుంది. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నాం. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాం. ఇరిగేషన్ కాలువలు ఆక్రమణల వల్ల ఇంత పెద్ద వరద వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఎక్కువగా ఉంది. ఇందిరా నగర్, పాత ఆర్.ఆర్.పేట, కొత్త ఆర్.ఆర్.పేట, పాయకాపురం, సింగ్ నగర్ లో బాధితుల కంటే 5 రెట్లు ఎక్కువ ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వరద తగ్గుతుందా లేదా అనే భయంతో కొంతమంది అవసరం లేకున్నా ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు.
వరద తగ్గినట్లే..
బుడమేరు గండ్లు పూడ్చడంతో మళ్ళీ వరద నగరంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. నీరు తగ్గగానే పారిశుధ్య పనులు వేగవంతం చేస్తాం. వర్షంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయానికి అడుగున్నర మేర తగ్గింది. రేపు ఉదయానికి పూర్తిగా వరద నీరు వెళ్లిపోతుంది. ఫైరింజన్లతో బురదను తొలగించి, శానిటేషన్, క్లోరినేషన్ చేస్తాం. వరద నీరు బయటకి వెళ్లిన 12 గంటల్లో ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తాం. 12లక్షల ఆహారం ప్యాకెట్ లు మొదల్లో పంపాం. ఇప్పుడు నాలుగు లక్షల ప్యాకెట్ లు పంపుతున్నాం. లోపల ఉన్న వరద బాధితులకు కూడా అన్నీ అందేలా చూశాం. బుడమేరుకు పడిన గండ్లు పూర్తిగా పూడ్చివేశారు. ఇంకా కట్ట ఎత్తు పెంచాలని నిర్ణయించి పనులు చేపట్టారు. బుడమేరు వరద నుంచి శాశ్వతంగా ప్రజలకు రక్షణ ఇచ్చే విధంగా కట్ట ఉండాలని చంద్రబాబు ఆదేశించారు’’ అని నారాయణ వెల్లడించారు.