Navratri 2023: విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా వేడుకలు వైభంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజను గవర్నర్‌ దంపతులు చేశారు. ఈ ఉదయం దుర్గమ్మకు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో స్వాగతం పలికారు. 


ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. తొలిరోజు ఇవాళ(ఆదివారం) బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం చేసిన తర్వాత అలంకరించారు. 


ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. ఆ టైంలోనే గవర్నర్ దంపతులు దేవీకి పట్టు వస్త్రాలు సమర్పించారు. 


పూర్ణకుంభంతో గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఉన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. 


అనంతరం మంత్రి రోజా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా నవరాత్రులు మహిళల పండుగగా అభివర్ణించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయి అన్నారు. 2018లో అమ్మవారిని కోరుకోగానే 2019లో 151 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. సుపరిపాలన అందిస్తున్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆశించారు రోజా. 2024లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్టు తెలిపారు. శత్రువులని జయించి తప్పకుండా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు.


ఏ రోజు ఏ అలంకరణలో కనిపించనున్నారంటే... 
అక్టోబర్ 16న గాయత్రీ దేవి
అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 18న మహాలక్ష్మి దేవి
అక్టోబర్ 19న మహాచండీ దేవి
అక్టోబరు 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి
అక్టోబర్ 21న లలితా త్రిపుర సుందరీ దేవి
అక్టోబరు 22న దుర్గాదేవి


అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.


భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్లను మానిటరింగ్ చేస్తున్నారు. వృద్ధులకు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. ఘాట్లలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఈసారి భక్తులు భారీగా తరలి వస్తారన్న అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వచ్చే భక్తుల కోసం ప్రసాదాలకు లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. అన్న ప్రసాదాలు కూడా నిరంతరం అందేలా చూస్తున్నారు. భక్తులకు దేవీ దర్శనం త్వరగా పూర్తి అయ్యేలా క్యూలైన్లలో రద్దీ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.