విజయవాడ- గుంటూరు నగరాల మధ్య గలగల పారుతూ సిరులు కురిపించే కృష్ణమ్మ కొందరు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతోంది. ఈత నేర్చుకోవాలని కొందరు, సెలవు రోజుల్లో స్నేహితులతో ఉల్లాసంగా గడపాలని మరికొందరు యువకులు, విద్యార్థులు నదిలో దిగి అర్ధాంతరంగా తమ నిండు ప్రాణాలను విడుస్తున్నారు.
ప్రతి ఏటా మరణాలు...
ప్రతి ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు, యువత ప్రమాదవశాత్తు కృష్ణమ్మ ఒడిలో కలిసిపోతున్నారు. రెండు రోజు క్రితం విజయవాడకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో మునిగిపోయి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చారు. ఈ ఘటనతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కృష్ణా నది, మచిలీపట్నం ముంగినపూడి బీచ్, బాపట్ల సూర్యలంక బీచ్‌లు డెత్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. చాలా మంది నగరానికి చెందిన యువత, విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికుల స్పందనతో కొందరు ప్రాణాలతో బయటపడుతుంతే మరికొందరు కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోతున్నారు.
ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం గుణపాఠాలు నేర్చుకోకుండా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. విజయవాడ మీదుగా ప్రవహించే కృష్ణానది వెంబడి పదుల సంఖ్యలో స్నాన ఘాట్లు ఉన్నాయి. విజయవాడకు చేరువగానే ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం ఘాటు మొదలు నగర శివారు ప్రాంతమైన యనమలకుదురు వరకు ఉన్న ఘాట్ల తీరును పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం అవగతం అవుతుంది. జనం ఎక్కువగా రాకపోకలు సాగించే పవిత్ర సంగమం, పున్నమి ఘాట్, దుర్గా ఘాట్, కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్ వద్ద నిఘా కెమెరాలు ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు సిద్ధంగా ఉంచుతున్నారు. అయితే పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు ఉన్న ఘాట్ల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు ఇవే కాక అనధికారకంగా ఉన్న అనేక గాట్ల ద్వారా నదిలోకి దూకి ప్రమాదాల బారిన పడుతున్నారు యువత. అనధికారికంగా నదిలోకి వెళ్లకుండా నియంత్రించేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో తెలిసి తెలియని వయసులో విద్యార్థులు ఈత నేర్చుకునేందుకు వెళుతూ నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
హెచ్చరిక బోర్డులు ఎక్కడ...
జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలు పద్మావతి ఘాట్ వరకే పరిమితమయ్యాయి. ఆ దిగువన ఉన్న ఘాట్ల వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో యథేచ్ఛగా నదీలోకి ఈతకు దిగుతున్నారు ప్రజలు. నది తీరం వెంబడి జనసంచారం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఇరిగేషన్ శాఖ ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ప్రవాహ వేగానికి సుడిగుండాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పైకి ఇసుక తిన్నెలు మాదిరిగా నీటిమడుగుల తరహాలో కనిపించే మృత్యు గుండాలను గుర్తించకపోవటంతో, వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇసుక తవ్వకాలు కూడా....
నది గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు కూడా సుడిగుండాలకు కారణమవుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు అనుమతించిన ప్రాంతాల్లోనే ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంది. అయితే కాసుల కోసం కక్కుర్తిపడి ఇసుక మాఫియా చెలరేగిపోతుంటే... అధికారులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం కూడా ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఇందులో తల్లిదండ్రుల బాధ్యతరాహిత్యం కూడా ఉందని మరికొందరి వాదన. తమ పిల్లలు ఇల్లు వదిలి గంటల తరబడి ఎక్కడ ఉంటున్నారో ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకూ ఉందంటున్నారు. తెలిసి తెలియని వయసులో స్నేహితుల మాటలు విని ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న యువతకు నది తీరంలో జరుగుతున్న మరణాలు ఒక గుణపాఠంగా గ్రహించకపోతే భవిష్యత్తులో నది గర్భంలో కలిసిపోయే వారి పెరుగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.