తెలుగుదేశం పార్టీ వల్లే పల్నాడులో అలజడి రేగిందని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. కావాలనే కుట్రతో టీడీపీ దాడులు చేయిస్తుందని మండిపడ్డారు. మాచర్లలో జరిగిన ఘటనను రాష్ట్రానికి ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


టీడీపీకి అలవాటే 


టీడీపీ పాలనలో పల్నాడులో నక్సలిజమ్, ఫ్యాక్షనిజమ్‌ తో పాటుగా యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ వేల కోట్ల విలువైన దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఏడుగురి దారుణ హత్య కేసులో బ్రహ్మారెడ్డి ఏ–1 నిందితుడిగా ఉన్నాడని అతనే ఇప్పుడు కూడా పల్నాడులో గొడవలు చేశారని అన్నారు. పల్నాడు ప్రాంతానికి టీడీపీ చేసిన మేలు ఒక్కటి చూపాలని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.4700 కోట్ల పనులు జరిగాయని పల్నాడు జిల్లాతో పాటు, మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు, ఎక్కడా లేని విధంగా మూడు జాతీయ రహదారులు, పల్నాడులో అనేక అభివృద్ధి పనులు, కార్యక్రమాలు నిర్వహించిన ఘనత దక్కిందన్నారు. గడిచిన 40 నెలల నుంచి పల్నాడును పులివెందులతో సమానంగా సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ది చేస్తున్నారని, ఫలితంగా దిక్కు తోచని తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతంలో అకృత్యాలు అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు.  దీంతో ఇదేం ఖర్మరా బాబూ అని పల్నాడు వాసులు అనుకుంటున్నారని, చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని చెప్పారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ దాదాపు రూ.4700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు.  గతంలో చంద్రబాబు పాలన సమయంలో 1999–2004 మధ్య, తిరిగి 2014–2019 మధ్య పల్నాడును లూటీ చేశారని విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో అల్లకల్లోలం, అరాచకాలు, హత్యలు చేశారని అన్నారు. మళ్లీ ఇప్పుడు అవే మొదలు పెట్టారని, దీంతో పల్నాడు వాసులు దిగ్భ్రాంతి చెందుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు పాలన సమయంలో పల్నాడులో మావోయిస్టుల ప్రభావం చాలా ఎక్కువ. కరువు, కాటకాలు ఎక్కువ. పంటలకు నీరందే పరిస్థితి లేదన్న విషయాలను ప్రస్తావించారు.


ఏడుగురి హత్యలో ఏ–1 బ్రహ్మారెడ్డి 


 కాంగ్రెస్‌లో ఉన్న  ఏడుగురు పోలీస్‌ స్టేషన్‌ బెయిల్‌ కోసం సంతకాలు పెట్టడానికి వెళ్తుంటే, పోలీస్‌ స్టేషన్‌కు చేరువలో దారుణంగా హత్య చేయించిన చరిత్ర బ్రహ్మారెడ్డిదని ఎమ్మెల్యే కాసు విమర్శించారు. ఆ కేసులో ఆయన ఏ–1 నిందితుడని, అందుకే ఆయనను అరెస్టు చేశారని అన్నారు. ఆ తర్వాత ఆయనకే మళ్లీ 2009లో టీడీపీ టికెట్‌ ఇచ్చారని, అప్పుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి చేతిలో.. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడని, దీంతో బ్రహ్మారెడ్డి మాచర్లలో కాకుండా, గుంటూరులో నివాసం ఉంటున్నాడన్నారు.


వారి లక్ష్యంగా దాడులు 


 బీసీల మీద దాడులు జరుగుతున్నాయని ముఖ్యంగా వడేరాజులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కాసు మండిపడ్డారు.  1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు వడేరాజులు ఆ పార్టీలో చేరారని, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వారిలో దాదాపు 70 శాతం వైయస్సార్‌సీపీకి ఓటేశారని అన్నారు.దీంతో వడే రాజులకు గడచిన 60, 70 ఏళ్లలో రాని పదవులు, 40 నెలల్లో వచ్చాయని, మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్, వడేరాజుల కార్పొరేషన్, గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్, మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డు ఛైర్మన్‌తో పాటు, ఇంకా వడేరాజులకు అనేక పదవులు లభించాయని తెలిపారు. దీంతో వడేరాజులపై చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు చేస్తు, రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ వారిని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.