సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ చిల్లర వివాదంలోకి తన కుటుంబాన్ని లాగడం బాధాకరం అని కారు వివాదంపై కేశినేని చిన్ని అన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు తనను ఆపారని,  పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలుతుందని, పార్టీలో తాను చిన్న కార్యకర్తనని, టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావడమే తమ లక్ష్యమన్నారు. కేశినేని నాని మాకు శత్రువు కాదు.. మా సొంత అన్న అని, తాను కేవలం పార్టీలో సాధారణ కార్యకర్తనని చెప్పారు.


ఎన్టీఆర్ శత జయంతిపై సైతం వివాదమేనా..
పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎవరినీ టిక్కెట్ అడగలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదని, కానీ ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చిందని కేశినేని చిన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను వాడే కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్నారు. ఆటోనగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించినా.. దాన్ని కూడా వివాదాల్లోకి లాగారని తెలిపారు.


పోలీసులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు..
హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టినా, నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు. అయితే తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ, ఎలాంటి రాజకీయపరమైన కారణం కాదన్నారు. తన మీద విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని స్వాగతిస్తానని.. కానీ  ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే, సోదరుడు కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు.


ఎంపీ నాని ఫిర్యాదుతో కేసు నమోదు.. 
మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు, ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420, 416, 415, 468, 499 35 3534 80 (ఎఫ్ఐఆర్ 523/2022) నమోదు చేశారు. అయితే ఇదే  వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. అయితే ఈ వాహనం కేశినేని జానకి లక్ష్మి పేరు మీద ఉంది. దీన్ని ఆమె భర్త కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. కేశినేని చిన్ని స్వయంగా నానికి సోదరుడు కావ‌టం విశేషం. చిన్ని హైదరాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సొంత సోదురుడి పైనే ఫిర్యాదు చేయడంతో ఎఐఫ్ఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేయడంతో ఈ వ్య‌వ‌హ‌రం అంతా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వచ్చి టీడీపీలో చ‌ర్చ‌నీయాశంగా మారింది.


Also Read: Kesineni Nani Family Dispute: సోదరుడిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు - కారు వివాద‌మా ! కుటుంబ వివాదమా !