Boatmen Problems: పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఏపీలో వరదలు పోటెత్తుతున్నాయి. ఇప్పటికీ 
వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు శాంతించాడు. అటు ఎగువ ప్రాంతాల్లోనూ వానలు తగ్గాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల నుండి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. చాలా ప్రాంతాల్లో చాలా రోజుల తర్వాత సూర్యుడి  కిరణాలు కనిపిస్తున్నాయి. అయితే వరద ప్రభావం ఎదుర్కొన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లాలపై వరద తీవ్ర ప్రభావం చూపింది. అటు గోదావరి పరివాహక గ్రామాలు, ఇటు  కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. చాలా గ్రామాలు బాహ్య ప్రపంచం నుండి సంబంధం తెగిపోయాయి. 


పడవలే కీలకం...


కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాలలో పడవ దాటింపు కార్మికుల సేవలు కీలకంగా మారాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని అదే విధంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పడవలో ప్రయాణం చేయడమే ఉన్నటు వంటి ఏకైక మార్గం. అధికారులు వెళ్లాలన్న... ప్రజా ప్రతినిధులు చూడాలన్న...  బాధితులు రేవు దాటాలన్నా పడవలే దిక్కు. ఈ సమయంలో కీలకంగా పని చేసే తమను ప్రభుత్వం,  అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆ కార్మికులు వాపోతున్నారు. గత మూడు ఏళ్లలో వరదలు వచ్చినప్పుడు ఇలాగే పడవ దాటింపులు చేశామని.. ఆనాటి నుంచి ఇప్పటి వరకు తమ కష్టానికి ఒక్క రూపాయి కూడా దక్కలేదని వారు ఆపోతున్నారు. 


దాటింపులకు డబ్బులు ఇవ్వరా?


గత వారం రోజులుగా లంక గ్రామాలలో పడవ దాటింపులు చేస్తున్నామని.. ఈ సారి కూడా తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పడవ దాటింపు కార్మికులు ఆరోపిస్తున్నారు. అదే ఏదో  కూలి పనుకో వెళితే 800 పైబడి తమకు వస్తున్నాయని ఇక్కడ కేవలం 550 రూపాయలు ఇస్తామని చెప్పారని వారు అంటున్నారు. వరదల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో సేవ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే తమ పరిస్థితిని పట్టించుకుని తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్నారు.


వరద తగ్గుముఖం...


గోదావరి, కృష్ణా పరిధిలో వరద క్రమేపీ తగ్గుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి శాంతించింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కూడా వరద తగ్గుముఖం పట్టింది.  కృష్ణాలో ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి వరద తగ్గుముఖం పట్టింది. కాగా,  శ్రీశైలం నిండు కుండలా మారుతోంది.  ఆ ప్రాజెక్టులోకి 3లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. విద్యుదుత్పత్తి కోసం 19వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.  మరో మూడు రోజుల పాటు వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో శుక్ర, శని వారాల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.


ఏ ప్రాజెక్టుకు ఎంత వరద... 


శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మేడిగడ్డ, తుపాకుల గూడెం  ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టులకు లక్షలకొద్దీ క్యూసెక్కుల వరద వస్తోంది. అత్యధికంగా తుపాకులగూడెం ప్రాజెక్టుకు 9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది.


ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కాస్తంత తగ్గింది. నాగార్జునసాగర్ కు కేవలం 26వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఆల్మట్టికి లక్షా 25వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.