పట్టణాలు, నగరాల్లోని రహదారులు పచ్చటి చెట్లతో, సుందరీకరణతో కొత్త శోభను సంతరించుకునేలా ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమానికి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల్లో పచ్చదనం, సుందరీకరణ పెంపొందించడానికి మొదటి విడతగా 45 పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కింద గ్రీన్ సిటీ ఛాలెంజ్‌లో మొదటి పది ర్యాంకులు సాధించిన పట్టణాలకు ఒక్కో కోటి చొప్పున రూ. 10 కోట్ల బహుమతి ప్రధానం చేయనున్నారు. 


రహదారికి మధ్యలో, ఇరువైపులా చెట్లు, మొక్కలు నాటేందుకు కొన్ని ప్రమాణాలు తీసుకున్నారు. మట్టి రకాలు, వాతావరణం, నీటి వనరుల లభ్యత, మొక్కలు, చెట్ల లభ్యత, సోషల్ స్ట్రక్చర్ బట్టి 5 రకాలుగా విభజించారు. 0.75 మీటర్, 0.9 మీటర్, 1.2 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్ల రహదారి మధ్యస్థ వెడల్పు కలిగిన రోడ్లకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పచ్చదనం, సుందరీకరణ పనుల మొదటి విడత కార్యక్రమానికి అంచనా వ్యయం రూ. 78.84 కోట్లు. 224 కి.మీ పొడవులో రహదారి మధ్యస్థ భాగాన్ని 44,804 చెట్లతో, 2,24,020 చ.మీ. విస్తీర్ణంలో గుబురు మొక్కలతో అభివృద్ధి చేపట్టనున్నారు. 1,276.46 కి.మీ.ల పొడవునా రహదారికి ఇరువైపులా 2,54,678 చెట్లు నాటేలా కార్యాచరణ చేపట్టారు. 


తొలకరి వానలు ప్రారంభం నుంచి ఆగస్టు 12 ముగిసే సమయానికి లక్ష్యానికి చేరువయ్యేలా కార్యాచరణను చేపట్టింది ప్రభుత్వం. రహదారి మధ్యస్థ భాగానికి 19 రకాల చెట్లు, 21 రకాల గుబురు మొక్కలు, రహదారి ఇరువైపులా 14 రకాల చెట్లు ఎంపిక చేసి మొత్తంగా 54 రకాల మొక్కలు, చెట్లను APG &BC ప్రతిపాదించింది. మొక్కలు, చెట్ల పర్యవేక్షణ బాధ్యత పట్టణ స్థానిక సంస్థ తీసుకుంటుంది. 


ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్థానిక సంస్థకు ర్యాంకులు ఇస్తారు. APG &BCకి చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకోసారి పర్యవేక్షిస్తూ తగిన సలహా, సూచనలు ఇస్తుంది. మొక్కలకు నీరు అందించడం, కలుపు తీయడం, బేసిన్ తయారీ, ట్రిమ్మింగ్/ఎడ్జ్ కట్టింగ్, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటడం వంటివి పర్యవేక్షిస్తారు.