IAS Transfers In Andhra Pradesh: అమరావతి: ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ డైరెక్టరుగా సి. నాగరాణిని నియమించారు. సాంకేతిక విద్యా శాఖ ప్రస్తుత డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.
కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆయనకు కీలక బాధ్యతలు
పాఠశాల విద్యాశాఖలో మౌలిక సౌకర్యాల కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ ను నియమించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ కొత్త పోస్టు ఏర్పాటు చేశారు. మిషన్ క్లీన్ కృష్ణా - గోదావరి కెనాల్స్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు సైతం కాటమనేనికి అప్పగించారు. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్.. దాంతో పాటుగా ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా బి. శ్రీనివాస రావును నియమితులయ్యారు. రైతు బజార్ల సీఈఓగా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ, కొత్త పోస్టింగ్ స్థానాలు ఇలా..
సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ - సి నాగరాణి.
సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్
బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
పాఠశాల విద్య శాఖలో స్కూళ్లలో మౌళిక వసతుల కల్పన కమిషనర్ గా కాటంనేని భాస్కర్
మిషన్ క్లీన్ కృష్ణా - గోదావరి కెనాల్స్ కమిషనర్ గా కాటంనేని భాస్కర్ కు అదనపు బాధ్యతలు
జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్.
ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా ఎం. ఎం నాయక్ కు అదనపు బాధ్యతలు
సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ - బి. శ్రీనివాస రావు.
రైతు బజార్ల సీఈఓగా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, బదిలీలకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌ను కోరాయి. బదిలీలకు సీఎం అంగీకరించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మీడియాతో అన్నారు. బదిలీలపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని సీఎం చెప్పినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు
25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటి నుంచే పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.