Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి వరదనీరు పోటెత్తింది. ఎగువ నాగార్జున సాగర్ నుంచి 4 లక్షల పై చిలుకు క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంది. దీంతో వరద నీటి ఉద్ధృతి శుక్రవారం సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు చేసింది.  


70 గేట్లు ఎత్తి నీరు విడుదల 


ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస‌్తున్నారు. ప్రస్తుతానికి 4 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. గేట్లు ఎత్తి సముద్రంలోకి 3 లక్షల 97 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. పంట కాల్వలకు 13 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.  మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయడంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


అధికారులు అప్రమత్తం 


ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద వస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  తాడేపల్లి మున్సిపాలిటీలోని సంబంధిత వార్డు పరిపాలన కార్యదర్శులు, ప్రాతూరు, గుండెమెడ, చిర్రావూరు గ్రామాల రెవిన్యూ, సచివాలయ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో కరకట్ట వెంబడి  ప్రజలను నది లోపలకి వెళ్లకుండా గస్తీ బృందాలను ఏర్పాటుచేయాలన్నారు. 



పులిచింతలకు భారీ వరద 


పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. దీంతో పులిచింతల గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు. అచ్చంపేట మండలం జడపల్లితండాలో లెవెల్ బ్రిడ్జి పై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. దీంతో మాదీపాడు-జడపల్లితండా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 4,37,910 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ  50.47 మీటర్లు(165.58 అడుగులు) కాగా పూర్తిస్థాయి నీటిమట్టం  53.34 మీటర్లు(175 అడుగులు)గా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో  4,03,233 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  4,37,910 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  కృష్ణానదిలో చేపలవేట, పడవ ప్రయాణాలు నిషేదించారు.  


పెళ్లిళ్లకు వరద కష్టాలు 


అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలోని చాలా గ్రామాలకు మళ్లీ వరద తాకిడి మొదలైంది. కోనసీమ లంక ప్రాంతాల్లో పెళ్లి ఇంట వరద కష్టాలు వచ్చాయి. వరదలు కారణంగా కాజ్ వే నీట మునిగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వరద ఉద్ధృతిలో బైక్ ల పై పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కాజ్ వే దాటిస్తున్నారు. పడవలపై పెళ్లి సామగ్రి, పెళ్లి బట్టలు, టెంట్ సమాన్లు తరలించే పరిస్థితి నెలకొంది. అకాల వరదలతో ఎంతో సరదాగా జరుపుకునే పెళ్లిళ్లను అతికష్టం మీద నిర్వహిస్తున్నారు. 


Also Read : TDP YCP In BJP Trap : వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !


Also Read : KTR: ఆ సేవలు తెలంగాణకు బాగా అవసరం, కొవిడ్‌లో కీలక పాత్ర హైదరాబాద్‌దే - కేటీఆర్‌