మునుగోడులో టీఆర్‌ఎస్ సమర శంఖం పూరించింది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే దీనిపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని 20న సంస్థాన్ నారాయణపూర్‌లో జరిగే ప్రజాదీవెన సభలో ప్రకటించబోతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నికలు రాబోతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు ఎవరూ దీన్ని ప్రకటించలేదు. మరోవైపు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. అక్కడ పోటీ చేసేందుకు ఇద్దరు బరిలో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. వాళ్లిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ లీడర్లంతా మూడు రోజులుగా దీనిపై కసరత్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న పరిస్థితిలో వచ్చిన మునుగోడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ జెండా ఎగరేసి వచ్చే ఎన్నికల నాటికి లైన్ క్లియర్ చేసుకోవాలన్న కసితో పని చేస్తున్నాయి. గత ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ ఎక్కువ సార్లు అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత సీపీఐకు ప్రజలు ఎక్కువ సార్లు పట్టంకట్టారు. టీఆర్‌ఎస్ ఒక్కసారి మాత్రమే అక్కడ గెలిచింది.
అభ్యర్థులపై ఆయా పార్టీల్లో చర్చలు జరుగుతుండగానే అధికార పార్టీ టీఆర్‌ఎస్ మాత్రం ఓ అడుగు ముందుకేసింది. పోటీ చేయబోయేది ఎవరో అనేది కేడర్‌కు స్పష్టంగా చెప్పేసినట్టు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ సీటు అయినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైన గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేదని నిరూపించుకోవాలని స్కేచ్ వేస్తోంది. అందుకే దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.