నాసా లో ఉద్యోగం సాధించడం అంటే అంత తెలికైన విషయం కాదు. నాసాలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కానీ దానికి ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. కానీ అది అందరి వల్ల కాదు. కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. ఇలాంటి ఎంతో ఉన్నతి స్థాయి సంస్ధలో తెలుగుబ్బాయి అది కూడా గుంటూరు కుర్రాడు ఉద్యోగం సాధించి చూపించాడు. 


అయితే ఆ కుర్రాడికి ఇదేమి ఒకేసారి వచ్చేయలేదు. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు , కుటుంబ సమస్యలు ఇలాంటి సమస్యలన్నింటిని ఎన్నో వాటిని దాటుకుంటూ ముందుకు వచ్చి ధైర్యంగా నిలిచాడు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. గుంటూరుకు చెందిన హర్షవర్దన్‌ రెడ్డి అనే యువకుడు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఉద్యోగం సాధించాడు. 


హర్షవర్థన్‌ రెడ్డి తల్లిదండ్రులు ఈశ్వర్‌ రెడ్డి, పార్వతిలు. వారి స్వస్థలం కడప. కానీ ఎన్నో సంవత్సరాల కిందటే గుంటూరుకు వచ్చి స్థిరపడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరిని కూడా బాగా చదివించాలనుకున్నారు. వారిద్దరూ కూడా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తూ వారిని ఉన్నత చదువులు చదివించారు. 


ఇద్దరు కుమారుల్లో హర్షవర్ధన్‌ రెడ్డి పెద్దవాడు. అతను చిన్నతనం నుంచి కూడా చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడు. పులివెందులలో పది, హైదరాబాద్‌ లో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం జేఈఈలో మంచి మార్కులు సాధించి ఐఐటీ గౌహతిలో సీటు సంపాదించాడు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. 


చదువులో మంచి ప్రతిభ చూపడంతో సిల్వర్‌ మెడల్ కూడా సాధించాడు. దీంతో హర్షవర్ధన్ కు ఓఎన్జీసీ వాళ్లు లక్ష రూపాయల ఉపకార వేతనం అందించి బంగారు పతకం ఇచ్చింది. ఇంజనీరింగ్‌ పూర్తి అయిన తరువాత హర్షవర్ధన్‌ రెడ్డి పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు. అయితే కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు. 


 హర్షవర్ధన్‌ తమ్ముడు నందన్‌ రెడ్డి ఎంబీబీఎస్‌ పూర్తి  చేసి పీజీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. దీంతో ఇద్దరిని చదివించడం కొంచెం తండ్రికి కష్టంగా మారింది. దీంతో హర్ష రిలయన్స్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు. దీంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. 


వెంటనే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసుకునేందుకు ఆప్లై చేసుకున్నాడు.  అక్కడ సీటు రావడంతో వెంటనే చేరిపోయిన హర్ష.. ఏరో స్పేస్‌ పీహెచ్‌డీ చేస్తున్నాడు. అక్కడ ఉండగానే నాసాలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. జులై 10న కాలిఫోర్నియాలోని నాసా  ఫీల్డ్ సెంటర్ లో ఇంజనీర్‌ గా బాధ్యతలు స్వీకరించాడు. 


ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించలేనిది ఏది లేదంటూ ఈ గుంటూరు కుర్రాడు చేసి చూపించాడు.