గుడివాడలో విదేశీ మెక్కల పెంపకంపై వివాదం మెదలైంది. అమెరికా తీర ప్రాంతంలో పెరిగే మొక్కలను గుడివాడ నగరంలో రోడ్లపై నాటటం వలన శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటూ భవిష్యత్ భద్రతా దళం అధికారులకు ఫిర్యాదు చేసింది.


వివాదం ఏంటంటే... 
గుడివాడ పట్టణంలో పచ్చదనం కోసం అమెరికా తీర ప్రాంతంలో పెరిగే విదేశీ మంగ్రూవ్ జాతికి చెందిన కోనో కార్పస్ మొక్కలను స్దానిక కార్పొరేషన్ అధికారులు రోడ్ల మధ్య, డివైడర్ ల మధ్య ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ మొక్కలు  పర్యావరణానికి, ప్రజల శ్వాసకోశాలకు హాని కలిగిస్తాయని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈవిషయాన్ని నిర్ధారించరంటూ భవిష్యత్ భద్రతా దళం అధికారులకు ఆ వివరాలను అందించింది. మాంగ్రువ్ జాతి కొనో కార్పస్  మొక్కలను వెంటనే తొలగించి వాటి స్థానంలో స్దానికంగా లభించే మొక్కలను నాటించటం ద్వారా, ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడమని కోరుతున్నామని భవిష్యత్ భద్రతాళానికి చెందిన సభ్యులు కార్పొరేషన్ అధికారులకు వివరించారు.


మెక్కల వలన వచ్చే నష్టం ఏంటంటే...
ఈ జాతికి చెందిన మొక్కల యొక్క పరాగ రేణువులతో ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని, మొక్క ఆకులను పశువులు కూడ తినవని భవిష్యత్ భద్రతా దళం సభ్యులు వై.వి.మురళీ క్రిష్ణ గుడివాడ మున్సిపల్ కమీషనర్ కు వివరించారు. అంతే కాదు ఈ చెట్ల పై పక్షులు సైతం వాలవని చెప్పారు. ఈ చెట్లు కార్బన్ మోనాక్సైడ్ వాయువుని ఎక్కువగా విడుదల చేస్తాయని, వీటి వేర్లు భూమిలోని మంచి నీటి పైపు లైన్ , డ్రైనేజీ వ్యవస్థని నాశనం చేస్తాయిని అన్నారు. తెలంగాణ ఉద్యానవనం, వ్యవసాయ అధికారులు గుర్తించి ఈ మొక్కలను నాశనం చేసి వాటి స్థానంలో మన ప్రాంత వృక్ష జాతి మొక్కలను నాటుతున్నారని వివరించారు. ఈ చెట్టు ప్రమాద తీవ్రతను గుర్తించి ఆంధ్ర ప్రదేశ్ ఉద్యానవన, వ్యవసాయ అధికారుల అభిప్రాయాలు తెలసుకొని, ఈ రకం చెట్లను తొలగించి  పర్యావరణానికి , ప్రజలకు, డ్రైనేజ్ , మంచినీటి వ్యవస్థకు హానీ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రజల  ప్రాణాలను కాపాడాలని సూచించారు.


గుడివాడలో కలకలం...
అమెరికా జాతికి చెందిన మెక్కల పెంపకం పై ఫిర్యాదులు రావటంతో అదికారులు సైతం అప్రమత్తం అయ్యారు. అసలు విషయాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులను కూడా మున్సిపల్ అదికారులు సంప్రదింపులు చేస్తున్నారు. అసలే గుడివాడ అంటే రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలన నియోజకవర్గం.. అలాంటి ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు ఇలాంటి మెక్కలను పెంచటం పై సైతం స్థానికంగా చర్చ మెదలైంది. నిత్యం రాజకీయ వ్యవహరాల్లో గుడివాడ పేరు వినిపిస్తుంటుంది, అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు రావటంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. భవిష్యత్ భద్రతా దళానికి చెందిన సభ్యులు ఈ వివరాలను మున్సిపల్ కమిషనర్ వద్దకు తీసుకువెళ్ళి, తమ వద్ద ఉన్నప్రాథమిక ఆదారాలను సమర్పించారు. అయితే ఈ విషయంలో శాస్త్రీయంగా ఉన్న పరిస్థితులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని, గుడివాడ ప్రజలు ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దని మున్సిపల్ కమిషనర్ భరోసా ఇస్తున్నారు.