రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల జీతాలు పెరగకపోగా తగ్గుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. చలో విజయవాడ అంచనాలను మించి విజయవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందో అన్నది ఆసక్తిగా మారింది.
సంక్షోభంలోనూ సంక్షేమ జపం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించారు. నవరత్నాల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్ర విభజన వల్ల ఆదాయాన్ని కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అప్పులు చేస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు.
ఉద్యోగుల్లోనూ కొండంత ఆశ
ముఖ్యమంత్రి వాగ్దానాలు అమలులో చూపిన చొరవతో తమ సమస్యలను పరిష్కరిస్తారని ఉద్యోగులు కొండంత ఆశతో ఎదురు చూశారు. మేనిపెస్టోలో చెప్పినట్టు సిపిఎస్ రద్దు చేస్తారని భావించారు. మెరుగైనా పీఆర్సీ వస్తుందని ఆశించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చేసరికి ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం
కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైపోయాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే ఇబ్బందికరంగా మారింది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పడటమే కష్టంగా మారింది. అయినా ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి పెంచుతూ వచ్చారు. ఆశుతోష్ కమిటీ నివేదిక అనుగుణంగా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వచ్చారు.
చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం
ఆశుతోష్ కమిటీ నివేదిక కాదని మంత్రుల కమిటీ సూచనలతో పెండింగ్‌లో ఉన్న 5 డిఎలను చెల్లిస్తూ 23శాతం ఫిట్మెంట్‌తోపాటు,హెచ్ఆర్‌లో భారీ కోత, సీసీఏ రద్దు చేసింది ప్రభుత్వం. దీనిపై ఉద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణకు దిగాయి. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.
వేతనం తగ్గడంతో ఉద్యోగులు షాక్
ఇప్పటికే పలు దఫాలు ప్రభుత్వంతో చర్చించి నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆందోళనను ముమ్మరం చేశారు. పీఆర్సీ అంటే వేతనాలు పెరుగుతాయని ఆశిస్తారు. కానీ ఈసారి తగ్గుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏలో తగ్గింపు తీవ్ర నష్టం చేస్తోంది. ఐఆర్ 27 శాతం ఇచ్చి ఫిట్‌మెంట్ 23 శాతానికే పరిమితం చేసిన మూలంగా బేసిక్ వేతనాల్లో కూడా ఉపయోగం కనిపించడం లేదు. పెండింగు డీఏలను సర్థుబాటు చేసినప్పటికీ 80 శాతం మంది ఉద్యోగులకు నష్టం తప్పడం లేదు. కనీసం మూడు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకూ నికర జీతాల్లో కోత పడుతోంది.
ఉరిమిన ఉద్యోగులు
ఇన్నాళ్లుగా ఎదురు చూస్తుంటే పీఆర్సీ వల్ల ప్రయోజనం లేకపోగా నష్టం కలిగించడం అన్యాయ మంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వీలున్నంత వరకూ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే పనిలో ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్మెంట్ వయసు పెంచడం వంటి నిర్ణయాలు ఉదారంగా తీసుకున్నామని పేర్కొటోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ చేయగల స్థితి లేదని చెప్పడం, ఉద్యోగ సంఘాలు సమ్మె అంటూ హెచ్చరికలు చేయడం రాష్ట్రంలో కొత్త వివాదంగా మారుతోంది.
ఆంక్షలు ఛేదించుకొని చలో విజయవాడ విజయవంతం
ఈ నేపథ్యంలో పిఆర్సి సాధన సమితి పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం అంచనాలను మించి విజయవంతమైంది. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడను అడ్డుకోడానికి ప్రభుత్వం తీవ్రస్థాయి నిర్బంధాలు అమలు చేసింది. చలో విజయవాడకు అనుమతి లేదని, అందులో పాల్గొనేందుకు వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను హెచ్చరిస్తూ నోటీసులిచ్చింది. విజయవాడకు వెళ్లే అన్ని మార్గాలనూ దిగ్బంధించింది. చలో విజయవాడకు వెళ్లొద్దని నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విజయవాడ వీధుల్లో కదం తొక్కారు. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగుల ఐక్య పోరాట పటిమకు ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
సర్కారు వారి మాటేంటంటే
ఇక ప్రభుత్వం వాదన విషయానికి వస్తే అడగకుండానే వరం ఇచ్చినా ఇలాంటి పరిస్దితులు ఎందుకు, ఎదురయ్యాయి అనేది ప్రశ్నగా మారింది. ఎవరికైనా కూడా అడిగినవి మాత్రమే ఇవ్వాలి. అడగకుండా ఇస్తే ఎదురు ఇబ్బందులు తప్పవు అని అర్దం అవుతుందని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. మనకు నచ్చినవి, ఎదుటి వారికి వరాలు కావు.. వారు అడిగింది, ఇవ్వకపోతే ఎంతటి వరమైనా అది మనకు శాపంగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. చలో విజయవాడ పరిణామాలు తరువాత అధికార పార్టి నేతల్లో వస్తున్న చర్చ ఇది.
అనుకున్నదొకటి అయిందొకటి
ఏపీలో ఇపుడు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బాట పడుతున్నారు. దాంతో వైసీపీ సర్కార్‌కి అదే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తారని ఎపుడూ ఏ రోజూ కూడా వైసీపీ పెద్దలు అనుకోలేదు. అందుకే వారి సమస్యలను ఎప్పుటికప్పుడు సాగదీస్తూ వచ్చారు. ఉద్యోగులు మన వారే అనుకోవటంతో, వారిలో అసంతృప్తిని గుర్తించ లేకపోయారు. సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా జగన్, ఉద్యోగులు కోరకుండానే కొన్ని వరాలు ఇచ్చారు. ఇందులో 62ఏళ్లకు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రదానమైంది. జగనన్నస్మార్ట్ కాలనీల్లో వారికి రాయితీ మీద ఇళ్ల స్థలాలు రిజర్వేషన్లు ఇవ్వడం. దీంతో ఉద్యోగులు మిగిలిన వాటి మీద తగ్గుతారని ఆ తరువాత అన్నీ కూడా సర్దుబాటు అవుతాయని ప్రభుత్వ పెద్దలు భావించారు.
సమ్మెవైపు అడుగులు
కాని సీన్ ఇక్కడే రివర్స్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులు తమకు తక్షణం రావాల్సిన అర్ధిక ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టారు. దీనిపైనే ఒత్తిడి కూడ పెంచారు. చివరికి చలో విజయవాడకు పరిస్దితి దారితీసింది. అది కాస్త సూపర్ సక్సెస్ కావటంతో ఇప్పుడు ఏకంగా సమ్మె వైపు అడుగులు పడుతున్నాయి.
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు
ఆర్టీసీ కార్మికులు అదే దారి పట్టారు. చరిత్రలో లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా మార్చినా కూడా వారు సమ్మెకు మద్దతు ఇచ్చారు. ఇది సర్కారులోని పెద్దలకు షాక్‌గా చెబుతున్నారు. అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం అయినా కూడా వారూ సమ్మె అంటున్నారంటూ ప్రభుత్వ సలహాదారు వ్యాఖ్యానించారంటే పరిస్దితి ఎలా ఉందో అర్దం అవుతుంది.
అప్పులు చేసి అయినా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ధీమాలో సర్కారు ఉంది. మరి ఈ పరిస్దితులు ఏపీలో ఉద్యోగుల సమ్మె ఎలాంటి మలుపు తీసుకుంటుంది. ఈ వ్యవహరం లో ఇంకెన్ని ట్విస్టులు ఎదురవుతాయో వేచి చూడాలి.