సమ్మె చేస్తే ఏమొస్తుందని.. సమ్మె నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఏపీ ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. చర్చలు జరిగితేనే అవి పరిష్కారం అవుతాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమని చెప్పారు. ఎక్కడ జీతం తగ్గిందో చెబితేనే కదా తెలిసేదని ఉద్యోగ సంఘాల నేతల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. 


పే స్లిప్‌లో పది రకాల విషయాలు ఉంటాయని, అన్నీ సరి చూసుకోవాలని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చి చూడాలన్నారు. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందని వివరించారు. 11వ పీఆర్సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చామన్నారు. ఉద్యోగులకు ఐఆర్‌ రూపంలో రూ. 18 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎస్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. తెలంగాణలా తాము కూడా  అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేదని సీఎస్‌ సమీర్‌ శర్మ వ్యాఖ్యానించారు. తెలంగాణలా తాము డీఏ ఇవ్వలేదని, ఐఆర్‌ ఇచ్చామని పేర్కొన్నారు. ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం లాంటిదని సీఎస్ ఉదాహరణ చెప్పారు. అంటే ఎప్పుడైనా తిరిగి చెల్లించాల్సిందేనని.. దాన్ని సర్దు బాటు చేశామని వివరించారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. 


ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమని, చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. కరోనా వల్ల రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని స్పష్టం చేశారు.  రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామన్నారు. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్ట్ చేయాలన్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులు  కూడా సమీర్ శర్మతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పే స్లిప్‌లను ప్రదర్శించిన ఉన్నతాధికారులు జీతం ఎలా పెరిగిందో వివరించారు.  బేసిక్ శాలరీ బాగా పెరిగినట్లుగా పే స్లిప్స్‌లో ఉంది. హెచ్‌ఆర్‌ఏ తగ్గిపోయినట్లుగా.. సీసీఏ రద్దు అయినట్లుగా చూపించారు. ఓవరాల్‌గా జీతం పెరిగినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. 


అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే తరహాలో మాట్లాడారు.  ఉద్యోగులతో చర్చలకు సిద్ధమని వారే సమస్యను జఠిలం చేస్తున్నారని ప్రకటించారు. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు.