గడప గడపకు కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేను సంప్రదించిన ఓ మహిళతో ఎమ్మెల్యే వంశీ మీరు ఆ రెండు పత్రికలు చదువుతున్నారనుకుంటా అని అన్నారు. అయితే అదే సమయంలో ఆ మహిళ స్పందిస్తూ మీరు అక్కడ నుండి వచ్చిన వారే కదా అని కౌంటర్ ఇచ్చారు. దీంతో వంశీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటుగా, తనకున్న పరిచయాలతో స్థానికులతో ఎమ్మెల్యే చర్చిస్తున్నారు. ఇదే సమయంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. స్థానికంగా సమస్యలను చెప్పిన మహిళతో ఎమ్మెల్యేకు మాటా మాటా పెరిగింది. అయితే సంభాషణ అంతా నవ్వుతూనే సాగింది. చివర్లో మాత్రం ఎమ్మెల్యేకు కౌంటర్ పడింది. స్థానిక సమస్యలను ఓ మహిళ ప్రస్తావించగా.. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మీరు ఆ రెండు పత్రికలు చదువుతున్నారనుకుంటా అని వంశీ వ్యాఖ్యానించారు. అదే స్టైల్ లో రెస్పాండ్ అయ్యారు. మీరు అక్కడి నుంచే వచ్చారని మహిళ సరదాగా కౌంటర్ ఇచ్చారు. మహిళ నుంచి సెకన్లలోనే కౌంటర్ రావటంతో వంశీ సైలెంట్ గా నవ్వుతూ వెళ్లిపోయారు.
టీడీపీ నుంచి గెలిచి, వైసీపీకి సన్నిహితంగా..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎక్కువ పట్టు ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి గన్నవరం నియోజకవర్గం అయితే, మరొకటి గుడివాడ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే గుడివాడ నుండి కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మాత్రం టీడీపీలోనే కంటిన్యూ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీకి దగ్గర అయ్యారు. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చినప్పుడు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు వంశీ. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయం మారిపోయింది. టీడీపీకి అత్యంత సన్నిహింగా ఉన్న కీలక నేతలు వైసీపీలోకి జంప్ కావటంతో స్థానికం రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీకి దగ్గర అయిన తరువాత వల్లభనే వంశీ టీడీపీని టార్గెట్ చేయటం, రాజకీయంగా విమర్శలు చేయటంతో హైప్ క్రియేట్ అయ్యింది. వంశీ అంతటితో ఆగకుండా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిపై కామెంట్స్ వ్యవహరంలో కూడా తలదూర్చారు. ఆ తరువాత వ్యతిరేకత రావటంతో క్షమాపణలు చెప్పారు.


గన్నవరం వైసీపీలో వంశీకి ఎదురుగాలి... !
టీడీపీ  టికెట్ తో గెలిచిన వంశీ అనంతరం అధికార వైసీపీకి దగ్గర కావటంతో, ఆ పార్టి నేతలు వంశీపై ఆగ్రహంతో ఉన్నారు. అధికార పార్టీలో సైతం వంశీకి ఎదురు గాలి వీస్తోంది. వైసీపీలో ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వర్గాలతో వంశీ ఢీ అంటే ఢీ అనాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ రెండు వర్గాలు ఎక్కడ ఎదురుపడినా వంశీకి తలనొప్పి తప్పటం లేదు. దీంతో సీఎం వైఎస్ జగన్ ఈ పంచాయితీ పై సమీక్ష నిర్వహించి, వంశీకి భరోసా కల్పించారని ప్రచారం జరిగింది. గన్నవరం నేతలు మాత్రం వంశీతో కలసి నడిచేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా తమను వేధింపులకు గురి చేసి, కేసులు పెట్టించిన వంశీ ఇప్పడు తమకు దగ్గర అయినంత మాత్రనా, ఆయనకు మద్దతు తెలుపడం సాధ్యం కాదంటున్నారు.