Kollu Ravindra Comments: అధికార పార్టీ వైసీపీ నాయకులు రోజురోజుకీ కమీషన్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. చివరకు బందరు పోర్టు విషయంలో కమీషన్ల కోసం విపరీతమైన దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మూడేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయని ప్రభుత్వం రూ.వేల కోట్లతో పోర్టు నిర్మాణం చేపడతామంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు కొల్లు రవీంద్ర. మరో పక్క పర్యావరణ అనుమతులు రాని క్రమంలో ఇటీవల పెడన వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోర్టు విషయంలో ఇప్పుడే శుభవార్త అందిందని ప్రకటించడం, తాజాగా ఎంపీ బాలశౌరి డిసెంబరులో పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పడం వినడానికే వింతగా ఉందన్నారు. 



గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు.. కానీ ! 
టీడీపీ ప్రభుత్వ హయాంలో 12 జెట్టీలతో ప్రతి బెర్తు వరకు ఓడలు వచ్చేలా ప్రతిపాదనలు ఇస్తే వాటిని చేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా 6 జెట్టీలతో పరిమిత లోతుతో పోర్టు అంటున్నారని, అటువంటి పోర్టు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు. పోర్టు పేరుతో తీసుకునే రుణాల్లో కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఓ పెద్ద రెడ్డి చేతిలో పెట్టారని, పోర్టును కూడా ఆయనకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు కం రైల్వే కనెక్టివిటీ కోసం ముడకు రూ.100 కోట్లు ఇచ్చే పరిస్థితిలో లేని ప్రభుత్వం రూ.5,000 కోట్లతో పోర్టు ఎలా నిర్మిస్తుందని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 


జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందులు, బెడ్‌లు, మృతదేహాలను తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌లు కూడా లేవని, ఇన్ని సమస్యలు వదిలేసి కమీషన్ల కోసం పోర్టు అంటూ నాటనం ఆడుతున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌లో విద్యార్థి చనిపోతే ఆచూకీ కనిపెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులే గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బండిపై తరలించే దయనీయ స్థితి ఏర్పడటం చాలా బాధాకరం అన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బందరు మంగినపూడి బీచ్ లో విద్యార్థి గల్లంతు అయితే ప్రభుత్వం గాలింపు చర్యలు కూడా చేపట్టలేదని.. కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మృతదేహం లభ్యమైన తర్వాత అధికారులు స్పందించలేదన్నారు. కుటుంబ సభ్యులే బైక్ పై మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న కొల్లు రవీంద్ర మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 






వైసీపీ నాయకులు ఇకనైనా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం మానాలని సూచించారు. నాయకులు గోపు సత్యనారాయణ, ఇలియాస్‌పాషా, లంకె నారాయణప్రసాద్‌, బొడ్డు నాగరాజు, కాంతారావు, కార్పొరేటర్లు తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.