Land Grabbing Case in Vijayawada : విజయవాడ: వైసీపీ హయాంలో భారీగా ల్యాండ్ స్కామ్ జరిగిందని, తనను బెదిరించి విలువైన భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ లాలా బాల నాగ ధర్మ సింగ్ ఆరోపించారు. అధికారం అడ్డుకుని పలుమార్లు తనను బెదిరించారని, తన ఇంటికి ఏసీబీని పంపి వేధింపులకు గురిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశారు.
గతంలో తనను గోవాలో బంధించి తన కుటుంబాన్ని బెదిరించి కోటి రూపాయలు ఇస్తేగానీ తనను వదిలిపెట్టలేదని.. చీమకుర్తి శ్రీకాంత్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఉద్యోగి ధర్మ సింగ్ ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆ లేఖలో కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ రాసినట్లు వైరల్ అవుతున్న లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి.
జూన్ 2024న రిటైరైన ధర్మసింగ్
‘నేను 1982 నుంచి, 2023 వరకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చివరిగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ గా పనిచేశాను. నేను జూన్ 2024 న రిటైర్ అయ్యాను. నేను, మా తండ్రి అయిన మధు సూధన సింగ్ హిందూ ధర్మదారులు, భక్తి పరులు అయినందున కొల్లూరు మండలం- బాపట్ల జిల్లా కొల్లూరులో శిధిలావస్థలో ఉన్న భవాని మాత ఆలయం, శివాలయం, అంజనేయ స్వామి ఆలయాలను 2011 నుండి 2002 మధ్య కాలములో దాతల సహకారముతో పునర్నిర్మాణం చేశాం.
2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, జగన్ బినామీలుగా చెప్పుకుంటూ వైస్ సునీల్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పీఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్ అను వ్యక్తిని నా వద్దకు పంపి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో వందల కోట్ల విలువైన భూములను, చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య (రీతూ చౌదరి) అతని కుటుంబ సభ్యుల పేరుమీద రిజిస్టర్ చేయాలనీ ఒత్తిడి చేశారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేను అని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించాను.
వారు చెప్పినట్లు రిజిస్ట్రేషన్స్ చెయ్యకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తాం అని, నీ కుటుంబ సభ్యులను వేధించి, డాక్టర్ సుధాకర్ లాగా ఆత్యహత్య చేసుకునేలా చేస్తాం అని, చంద్రబాబు అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాం, నిన్ను నీకుటుంబాన్ని ఇరికించి, నీవు కట్టించిన దేవాలయాలు అక్రమ ఆస్తులుగా చూపింది జైలుకు పంపుతామని బెదిరింది. నా చేత కొన్ని వందల కోట్ల విలువల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపులలో నాపై అధికారి లయిన ఆడిట్ రిజిస్టర్ కే.రామారావు కూడా భాగస్వామి. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతి రెడ్డికి బినామీ అయినందున, కొన్ని వేల కోట్ల రూపాయం భూములు తప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు.
ఏసీబీ రైడ్స్‌తో బెదిరింపులు.. ఆధారాలు ఉన్నాయి సార్..
ఈ భూములకు సంబందించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తాం అని బెదిరించి నా కష్టార్జితం అయిన ఇంటిని తాకట్టు పెట్టింది 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంకా భూములు రిజిస్టర్ చెయ్యాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంక తప్పుడు రిజిస్ట్రేషన్లు చెయ్యలేను అని చెప్పగా, నవంబర్ 17, 2023 న, నేస్తు ఇంట్లో లేని సమయంలో, ఏకధాటిగా నా కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైకి ఏసీబీ అధికారుల్ని పంపి, వారి "కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోదాలని బెదిరించారు. నా పై విజయవాడ ఏసీబీ FIR: 05/RAC/CIU/ACB-2023 కేసు సమోదు చేశారు. కొల్లూరు లో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద దాడి చేసి, దేవాలయాన్ని కూడా అక్రమ ఆస్తులుగా చూపించి వాటికీ సంబందించిన అన్ని పత్రాలు తీసుకొని వెళ్లారు.
నా ఫ్యామిలీని నమ్మించి కోటి కొట్టేశాడు
చీమకుర్తి శ్రీకాంత్ అను వ్యక్తి ఏసీబీ వారినుంచి నన్ను కాపాడతా అని, నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి కోటి రూపాయలు వసూలు చేశాడు. వారు అప్పు చేసి మరీ డబ్బు ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధింది, రావాల్సిన డబ్బు కోటి రూపాయలు నా ఫ్యామిలీ నుంచి వసూలు చేశాక వదిలేశాడు. నేను హార్ట్ పేషేంట్ అయినందుకు అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేదు. ఇప్పటికి నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది. దయతో మీరు దీనిపై విచారణ జరిపి, ఏసీబీ అధికారుల ఒత్తిడి నుండి రక్షించండి. చీమకుర్తి శ్రీకాంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను’ అని చంద్రబాబు, నారా లోకేష్‌లకు రిటైర్డ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది.