కోర్టు ఆదేశాలు, కేంద్రం నిర్ణయంతో తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఏపీలో జాయినింగ్‌ రిపోర్ట్ ఇచ్చారు. ఉదయం గన్నవరం చేరుకున్న ఆయన... విజయవాడ వెళ్లి జీఏడీలో రిపోర్ట్ చేశారు. జాయినింగ్‌ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు.  


జాయినింగ్ కోసం హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న సోమేష్‌కుమార్ గన్నవరం విమానశ్రయంలో మీడియాతో మాట్లాడారు... కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చానన్నారు. జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారని... ఆ ఆదేశాల మేరకు రిపోర్ట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాను ప్రభుత్వ అధికారినని.. ఎలాంటి పోస్టు, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. 


ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌(IAS) అధికారి సోమేష్‌ కుమార్‌ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. సోమేష్‌ కుమార్‌ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్‌ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ కంటే సమర్థులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్‌పై రప్పించుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంపై సోమేష్‌ కుమార్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఆయన ఏపీకి రావాల్సి వచ్చింది. 


ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ (గురువారం) మంచిదని ఏపీలో రిపోర్టు చేశారు. ఇంకో ఏడాది ఆయనకు పదవీకాలం ఉంది. ఈ ఏడాది పదవిలో ఉంటారా లేకుంటే సీఎంతో కలిసిన అనంతరం వీఆర్‌ఎస్‌ తీసుకుంటారా అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది. ఆయన మాత్రం ఫ్యామిలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. 


ఆయన వీఆర్ఎస్ తీసుకోవాలన్నా ముందు పదవీబాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఉద్యోగంలో చేరిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్‌ ఖరారు చేయనుంది. ఏపీలో ఎలాంటి పోస్టు ఇచ్చినా చేయడానికి సిద్ధమనే సోమేష్‌కుమార్ చెబుతున్నప్పటికీ...  సీఎస్ స్థాయిలో పని చేసిన వ్యక్తి మిగతా పోస్టుల్లో కుదురుకోవడం చాలా ఇబ్బందే. అందుకే ఆయన నెక్ట్స్‌ తీసుకునే స్టెప్ ఏంటని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.