భార్యకు నెలకు 8 లక్షలు భరణంగా చెల్లించాలని సినీ నటుడు పృథ్వీరాజ్‌ను కోర్టు ఆదేశించింది. తన భర్త నెలకు 30 లక్షలకుపైగా సంపాదిస్తున్నారని తమను పట్టించుకోవడం లేదని పృథ్వీరాజ్ భార్య 2017 జనవరి 10న న్యాయస్థానానని ఆశ్రయించారు.


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసి అయిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ తనను 1984లో వివాహం చేసుకున్నాడని శ్రీలక్ష్మీ పేర్కొంది. తమకు కుమార్తె, కుమారుడు ఉన్నట్టు వెల్లడించింది. 


పృథ్వీరాజ్‌ తన పుట్టిల్లు అయిన విజయవాడలోనే ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారని శ్రీలక్ష్మీ తెలిపారు. అవసరమైన డబ్బులు తన పేరెంట్స్‌ ఇచ్చేవాళ్లని పేర్కొన్నారు . అవకాశాలు పెరగడంతో తమపై వేధింపులు పెరిగాయని విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టుకు వివరించారు శ్రీలక్ష్మీ. 


ప్రస్తుతం తాము విడవిడిగానే ఉంటున్నామని... అందుకే భర్త అయిన పృథ్వీరాజ్‌ నుంచి భరణం ఇప్పించాలని కోర్టును కోరారామె. తన భర్త నటిస్తూ నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందులో నుంచి ఎంతోకొంత భరణంగా ఇప్పించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. 


ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పృథ్వీరాజ్‌ భార్యకు న్యాయం చేయాలని తీర్పు ఇచ్చింది. నెలకు 8 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి భరణం ఇవ్వాలని సూచించింది. ప్రతి నెల 10తేదీ నాటికి భరణం ఆమె అకౌంట్లో వేయాలని వివరించింది కోర్టు.