AP Police issues Notice to Perni Nani | మచిలీపట్నం: వైఎస్ఆర్‌సీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (పేర్ని వెంకట్రామయ్య)క, ఆయన భార్య పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్ సన్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారని అటు అధికార కూటమిలో, ఇటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


నేడు ముగియనున్న పోలీసులు ఇచ్చిన డెడ్‌లైన్


తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం. డిసెంబర్ 22న మధ్యాహ్నం 2 గంటల లోపు రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాస్తవాలు వెల్లడించాలని, గోడౌన్‌లో రేషన్ బియ్యానికి సంబంధించి వారికి అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో  పోలీసులు పేర్కొన్నారు.




పేర్ని జయసుధ గోడౌన్లలో బియ్యం మాయం


మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నం నియోజకవర్గంలో గోడౌన్లు ఉన్నాయి. ఆ గోదాముల్లో పౌరససరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేవారు. ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టాలని ఓ యాప్ తీసుకొచ్చింది. అనంతరం యాప్ వినియోగం, బియ్యం నిల్వలపై ఎప్పటికప్పుడూ గోడౌన్ యజమానులు వివరాలు అప్‌డేట్ చేయాలని వారికి ట్రైనింగ్ సైతం ఇప్పించింది పౌరసరఫరాల శాఖ. అయితే ఆ మరుసటి రోజే తమ గోదాముల్లో బియ్యం లెక్కలు తక్కువగా కనిపిస్తున్నాయని, తగ్గిన రేషన్ బియ్యానికి సంబంధించి లెక్కకట్టి ప్రభుత్వానికి నగదు చెల్లిస్తామని పేర్ని జయసుధ గోదాము నుంచి సంబంధిత అధికారులకు లేఖ రాశారు.


గతంలోనే గోదాము నుంచి పెద్ద ఎత్తున బియ్యం మాయమయిందని, అధికారులు ఆ లేఖను అంతగా పట్టించుకోలేదు. కానీ బియ్యంపై అక్రమాలపై సహించేది లేదని, పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం స్కాంపై చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇదివరకే రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడంతో టీమ్ అన్ని వివరాలను చెక్ చేస్తుంది. ఈ క్రమంలో తమ గోడౌన్ లో ఉన్న బియ్యం తగ్గిందని, వాటి విలువ ఎంతో చెబితే తాము డబ్బులు చెల్లిస్తామని లేఖ రాసి అడ్డంగా బుక్కయ్యారు. ఇది డబ్బు చెల్లింపులకు చెందిన సమస్య కాదని, అసలు బియ్యం ఎక్కడికి పోయింది.. ఏం చేశారనే దానిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.



పేర్ని జయసుధపై కేసు, ఆజ్ఞాతంలోకి పేర్ని నాని!
తన భార్య పేరిట ఉన్న గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కావడంతో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో పేర్ని నాని కొన్ని రోజులు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తనమీద కేసు నమోదు కాకపోవడం, పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్ వేయడంతో పేర్ని నాని మచిలీపట్నం వైసీపీ నేతలతో ఇటీవల సమావేశం అయ్యారు. పరారీ వార్తలపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని.. తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లానని చెప్పారు.


Also Read: Nadendla Manohar: పేర్ని జయసుధ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, క్రిమినల్ చర్యలు తప్పవన్న నాదెండ్ల మనోహర్