Bhavani Diksha Viramanalu 2024: అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణల సందడి ప్రారంభమైంది. క్యూలు, షెడ్లు, విద్యుదీకరణ, మైక్, సౌండ్ సిస్టమ్, ఇరుముడి విరమణ పాయింట్లు, నగరం వెలుపల భక్తులు వేచి ఉండే పాయింట్లు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, హోమ గుండాల నిర్వహణ తదితర అంశా లపై ముందుగానే సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు ఈవో రామారావు. 21 ఉదయం 6.30 గంటల నుంచి అమ్మవారి దర్శనం లభిస్తుందని .. 22 నుంచి 25 వ తేదీవరకూ వేకువజాము 3 నుంచి రాత్రి 11 వరకూ దుర్గమ్ను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అన్ని క్యూలైన్ల నుంచి భక్తులు ఉచిత దర్శనం చేసుకోవచ్చని సూచించారు ఈవో.
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
ఆర్జిత సేవలు రద్దు
డిసెంబర్ 21 నుంచి 25 వరకూ భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. కనకదుర్గానగర్లోని ప్రసాదం కౌంటర్లతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్ 1వ నెంబరు ఫ్లాట్ ఫామ్ పై 3 షిప్టుల్లో ప్రసాదం కౌంటర్లు పనిచేస్తాయని ఈవో స్పష్టం చేశారు. దీక్ష విరమణ కు ముందు సుమారు 8 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ ను భవానీలు చేస్తారు..ఈ మేరకు ఆ ప్రాంతాలలో కూడా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండచుట్టూ టెంట్లు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఇంకా గంటలతరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణి చేస్తున్నారు. సీతమ్మవారి పాదాల ఘాట్లో లో 500 షవర్లు, భవానీ ఘాట్లో 100 షవర్లు, పున్నమి ఘాట్లో 100 షవర్లు ఏర్పాటు చేశారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉచిత అన్న ప్రసాదం
ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ సందర్భంగా దేవస్థానానికి వచ్చే భవానీలు, భక్తులకు ఉచిత అన్న ప్రసాదం అందించే ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ఉదయం 630 నుంచి 10.30 వరకు పులి హోర, పొంగలి ప్రసాదం... ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నవితరణ కార్యక్రమం ఉంటుంది. తిరిగి సాయంత్రం నుంచి రాత్రి వరకు పులి హోర పంపిణీ చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 25 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
మహా మండపం దిగువన హోమగుండం
దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం సీతమ్మ వారి పాదాల సెంటరు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దిగువన 8 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. డిసెంబరు 20 శుక్రవారం సాయంత్రానికి కొండకు చేరుకున్న భక్తులు శనివారం ఉదయం నుంచి దీక్ష విరమణలు ప్రారంభించారు. ముందుగా కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గిరిప్రదక్షిణ పూర్తిచేసి..అమ్మవారి దర్శనం తర్వాత మహా మండపం దిగువన దీక్ష విరమణ చేస్తున్నారు. ఆ పక్కనే ఏర్పాటు చేసిన హోమగుండంలో నేతి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులు జరిగే భవాని దీక్షల విరమణ కార్యక్రమం కోసం నిరంతరం వీక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసు సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీక్షావిరణల సందర్భంగా ఇంద్రకీలాద్రి శోభాయమానంగా వెలిగిపోతోంది..