మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ కు లేఖ రాశారు. గుడివాడలో నిర్వహించిన క్యాసినో అంశంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయన లేఖ‌లో కోరారు. క్యాసినో నిర్వహణకు కారణమైన మంత్రి కొడాలి నానిని మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్తర‌ఫ్ చేయాల‌ని కోరారు. గుడివాడ‌లో క్యాసినో, జూదం నిర్వహించడం వాస్తవమనని అన్నారు. గుడివాడ వెళ్లిన టీడీపీ నేత‌ల కార్లను కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేశార‌ని అన్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే చ‌ర్యలు తీసుకోక‌పోగా తిరిగి టీడీపీ నేత‌ల‌పైనే కేసులు పెట్టార‌ని చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.


సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌లో క్యాసినో, జూదం నిర్వహించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని అన్నారు. వాస్తవాలను కనుగొనేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వెళితే కార్లు ధ్వంసం చేశారని, తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


Also Read: Movie Tickets Meeting : టిక్కెట్ వివాదంపై ఫిబ్రవరి2న మరోసారి భేటీ.. ఈ సారి టాలీవుడ్ తరపున చిరంజీవిని ఆహ్వానిస్తారా?


మరోవైపు, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గురువారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను విజయవాడలో కలిసింది. ఈ మేరకు గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. అదేవిధంగా గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడులు, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా మహేశ్వరరావు తదితరులు ఉన్నారు.