Handloom Day in Vijayawada: చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరి కోసం చేనేత చీరలు కొన్నారు. నేతన్నలని ఎంకరేజ్ చేశారు. విజయవాడలో బుధవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో చేనేత ఉత్పత్తులను పరిశీలించి అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. 


ఆయా చేనేత చీరల ప్రత్యేకతల గురించి చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొన్నారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోగా.. వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో చీరకు ముడి సరకుకు అయ్యే ఖర్చును, అది అమ్మే ధరను తెలుసుకున్నారు. జీఎస్టీ వల్ల చీర ధర ఎక్కువ అవుతుందని వారు చంద్రబాబుకు వివరించారు.        


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. సుమారు 80కి పైగా స్టాల్స్‌లో చేనేత బట్టలు ఉంచారని అన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించామని తెలిపారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని.. జీఎస్టీ తొలగించని పక్షంలో రీఎంబర్స్‌ చేస్తామని అన్నారు.              


ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని.. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తున్నట్లు పిలుపు ఇచ్చారు. కార్మికులకు చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 



చేనేతకు చేయూతనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది 


‘‘97 వేల మంది నేతన్నలకి, 50 ఏళ్ళకే రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. స్కిల్ డిజైన్ నేర్పించి, ఆదాయం పెంచే విధానం తీసుకుని వస్తాం. చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య భీమా కోసం, రూ.10 కోట్లు వెంటనే ఇస్తున్నాం. పొదుపు నిధిలో త్రిఫ్ట్ ఫండ్ లో, రాష్ట్ర ప్రభుత్వ వాటా 8% నుంచి 16%  పెంచి, నేతన్నల భవిష్యత్తు అవసరాలకు దోహదపడతాం. రూ.70 కోట్ల వరకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం. గ్రూపుగా మగ్గం పెట్టుకోవటానికి స్థలం ఇస్తాం. ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు, మగ్గాలు ఏర్పాటు చేసుకోవటానికి రూ.4.30 లక్షలకు అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. ఉత్పత్తులకు సరైన ధర రావటానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ప్రైవేటు రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా సహకరిస్తాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.