YS Sunitha Meets Home Minister Anitha : వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం అమరావతిలోని సచివాలయంలో ఏపీ హోంమంత్రి అనితతో సమావేశమైన సునీత ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని న్యాయం చేయాలని అభ్యర్థించారు. 


హత్య జరిగినప్పటి నుంచి పరిణామాలు మరోసారి హోంమంత్రికి గుర్తు చేశారు సునీత. గత  ప్రభుత్వ హయాంలో పెద్దలు నిందితులకు అండగా నిలిచారని దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారని వాపోయారు. దర్యాప్తు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటూనే... ఇప్పటి వరకు విచారణకు అడ్డుపడ్డ వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఐదేళ్లుగా దర్యాప్తును వేగవంతం చేసిన విచారణ అధికారులపై, సాక్షులపై కేసులు పెట్టి బెదిరించే ధోరణితో కొందరు వ్యవహరించారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితకు సునీత రిక్వస్ట్ చేశారు. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని అభ్యర్థించారు. 


సునీత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. వైఎస్ వివేకానంద కేసులో సీబీఐ దర్యాప్తునకు తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కచ్చితంగా దోషులకు శిక్ష పడుతుందన్నారు. ఈ విచారణను అడ్డుకునే వాళ్లపై కూడా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఎవర్నీ వదిలి పెట్టే పరిస్థితి ఉండదని బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అనిత. 


అనితతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యేందుకు వైఎస్ సునీత ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశంలో ఉన్న చంద్రబాబుతో కాసేపట్లో సునీత మీట్ అవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.