DSNLU Visakhapatnam Introduces Menstrual Leave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (DSNLU) విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ఇవ్వనుంది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థినులు కేవలం ఈమెయిల్ ద్వారా సమాచారమిస్తే చాలు.. ఈ ప్రత్యేక సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
పీరియడ్ సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. తమకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవు ఇవ్వాలంటూ.. యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజిస్ట్రార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులకు సెలవు ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది.
ఇప్పటికే 7 లా యూనివర్సిటీల్లో అమలు..
దేశంలోని 7 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు పీరియడ్ సెలవుల విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ; ముంబయి, ఔరంగాబాద్‌లలోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్‌పూర్‌లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిషియల్ అకాడమీల్లో ఈ విధానం అమలుచేసున్నాయి. ఈ విధానాన్ని అమలు చేయనున్న 8వ యూనివర్సిటీగా దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ నిలిచింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఏమందంటే?
నెలసరి సమయంలో మహిళలకు సెలవుల అంశంపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. విషయం సుప్రీంకోర్టు వరకూ చేరింది. మహిళలకు నెలసరి సమయంలో పూర్తిగా సెలవు ఇవ్వడం అనేది వారి బలహీనతకు చిహ్నంగా కనిపిస్తుందని ఒక వర్గం అంటుంటే.. ఈ రోజుల్లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే వారికి మేలు జరుగుతుందని మరో వర్గం వాదిస్తోంది. ఇటీవల ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఈ చర్చకు కారణం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే, అది వారి ఉద్యోగావకాశాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
ఒకవైపు మహిళలకు పీరియడ్ సెలవులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే.. మరోవైపు దీనివల్ల వారిపై పడే ప్రభావాన్ని కోర్టు వివరించే ప్రయత్నం చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం పడొచ్చని తెలిపింది. నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళల ప్రయోజనాల కోసం తాము చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు బెంచ్ గుర్తు చేసింది. కాబట్టి ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. దీనిపై కేంద్రాన్ని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. అలాగే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి దీనిపై ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.