State Roads: అడుగుకొక గుంత...గజానికొక గొయ్యి..ఇదీ క్షుణ్ణంగా చెప్పాలంటే ఏపీ రోడ్ల పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇవి చిన్నపాటి చెరువులను తలపించాయి. రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారుల పరిస్థితే ఇలా ఉందంటే...ఇక గ్రామీణ రోడ్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. 


పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం
వైసీపీ హయాంలో రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని అధికారంలోకి రాకముందు నుంచీ కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మరికొన్నిరోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అయితే రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద చిల్లగవ్వ కూడా లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన రోడ్లను పీపీపీ(PPP) విధానంలో నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్లను పిలవాలని సూచించారు. ఈ విధానంలో తొలుత ప్రైవేట్ కాంట్రక్టర్లు రోడ్డు నిర్మించి కొంతకాలం టోల్‌గేట్  ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత ఆ రోడ్డును ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీంతో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకపోయినా...ప్రజలపైనా, వాహనదారులపైనా టోల్‌రుసుం రూపేనా భారం పడనుంది. ఇప్పటి వరకు జరిగేది ఇదే. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేదు. టోల్‌ ఫీ వసూలు చేస్తుందా లేకుండా ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందా ఆనేది క్లారిటీ లేదు. ప్రసుత్తానికి అయితే విధి విధానాల రూపకల్పలోనే  ఈ ప్రాజెక్టు ఉంది. 


1778 కిలోమీటర్ల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా బాగా పాడైపోయిన, ముఖ్యమైన 27 రోడ్లను ముందుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1778 కిలోమీటర్ల మేర పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. దీనికి సుమారు 4వేల కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా అతి ముఖ్యమైన 14 రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా.. తర్వాత మిగిలిన రోడ్లను పూర్తి చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు టోల్‌ఫీజు వసూలు చేసే విధానం కేవలం జాతీయ రహదారులపైనే ఉంది. ఇప్పుడు పీపీపీ విధానంలో రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపట్టనుండటంతో ఇకపై వీటికి టోల్‌ఫీజు వసూలు తప్పదా అనే వాదన ఉంది. ఇలా చేస్తే ఇది కచ్చితంగా వాహనదారులపై భారం వేయడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారులపై అధిక టోల్‌ఫీజు వసూళ్లతో వాహనదారులు గగ్గోలు పెడుతుండగా...ఇప్పుడు రాష్ట్ర రహదారులకు సైతం టోల్‌ ఫీజు కట్టాల్సి రావడంతో మరింత భారం పడుతుందని మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సులకు సైతం టోల్‌ఫీజు వసూలు చేయనుండటంతో ఆ భారం చివరికి ప్రజలపైకి చేరుతుందన్నారు. కొంచెం కష్టమైనా రుణాలు తీసుకొచ్చి ప్రభుత్వమే రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు.


పీపీపీ విధానంలో నిర్మించనున్న రహదారులు ఇవే


1. కలింగపట్నం- శ్రీకాకుళం- పార్వతీపురం
2. గార- ఆమదాలవలస-బత్తిలి
3. చిలకాపాలెం-రాజాం- రాయగడ్‌ రోడ్డు
4. భీమిలి-చోడవరం-తుని
5. విశాఖ- ఎస్‌.కోట- అరకు
6. కాకినాడ- జొన్నాడ
7. రాజమండ్రి- మారేడుమిల్లి- భద్రాచలం
8. అమలాపురం- బొబ్బర్లంక
9. రాజవరం-పొదలాడ
10. ఏలూరు- కైకలూరు
11. ఏలూరు- చింతలపూడి- మేడిశెట్టివారిపాలెం
12. భీమవరం-కైకలూరు- గుడివాడ
13. గుడివాడ- విజయవాడ
14. విజయవాడ-ఆగిరిపల్లి- నూజివీడు
15. గుంటూర- పర్చూరు
16. నరసరావుపేట- సత్తెనపల్లి
17. వాడరేవు-నరసరావుపేట- పిడుగురాళ్లరోడ్‌
18. కావలి-ఉదయగిరి-సీతారాంపురం రోడ్
19. నెల్లూరు- సైదాపురం రోడ్‌
20. గూడూరు-రాపూరు-రాజంపేట రోడ్‌
21. మైదుకూర- తాటిచర్ల రోడ్‌
22. పులివెందుల-ధర్మవరం-దమజిపల్లిరోడ్‌
23. చాగలమర్రి-వేంపల్లె-రాయచోటి రోడ్‌
24. అనంతపురం రింగ్‌రోడ్
25. సోమందేపల్లి-హిందూపురం-తుమకుంట
26.అనంతపురం- కదిరి రింగ్‌రోడ్
27.కాలవగుంట-పెనుమూరు నెండ్రగుంట రోడ్