అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని, తెలుగు ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పదేపదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలని చెప్పడానికి కారణం వెల్లడించారు. ఏపీలో అవకాశాలు మెరుగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని, ఫలితంగా తెలంగాణ ప్రజలకు పలు రంగాల్లో ఉపాధి మెరుగవుతుందన్నారు.


‘హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతాయి. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారికి సహకరించాలి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ లను అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ అక్కడ వారు బతకలేకపోతున్నామని క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారని’ పవన్ కళ్యాణ్ చెప్పారు. 






ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు అయిపోందని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలంగాణ అధికారులు, క్యాబ్ డ్రైవర్లు తమను వేధిస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడేందుకు ఆఫీసు బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి చెందిన క్యాబ్ డ్రైవర్ల సమస్యలను స్వయంగా విన్నారు. 


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఏపీ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ ఇక్కడ ఆఫీసులు మొదలు కానున్నాయి. ఇక్కడ మీకు అవకాశాలు పెరుగుతాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. దాదాపు 2 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చూస్తాం. హైదరాబాద్ లోని క్యాబ్ డ్రైవర్ కార్మికులు సైతం ఏపీకి చెందిన తోటి డ్రైవర్ల కోసం స్పందించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకారం అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు’’.