Tight security To Chandrababu At Rajahmundry jail:
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు అంతగా రక్షణ ఉండదని, ఆయనకు హౌస్ కస్టడీకి అనుమతివ్వాలని ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టులో విన్నవించారు. అయితే ఈ విషయాలపై సీఐడీ తరపున వాదించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జైల్లో చంద్రబాబుకు ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, చంద్రబాబు అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆయన బ్లాక్ వద్దకు కూడా వెళ్లలేరని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు పూర్తయిన అనంతరం పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ... ఆయన కోసం ఓ బ్లాక్ మొత్తం కేటాయించామని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌పై స్పందించారు. సీఆర్పీ చట్టంలో హౌస్ రిమాండ్ అనేది లేదని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పథకం పేరుతో రూ.371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైందని ఆయన ఆరోపించారు. షెల్ కంపెనీలపై జీఎస్టీకీ ఆధారాలు దొరికాయని, అందువల్లే సీఐడీ అధికారులు విచారణలో ముందుకు వెళ్లారని చెప్పారు. గత ప్రభుత్వ పెద్దలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఇదివరకే అలర్ట్ చేశారు. ప్రజల సొమ్ము దొంగ కంపెనీల ద్వారా ఓ వర్గం చేతిలోకి వెళ్లిందని చెప్పారు. స్కిల్ స్కామ్ ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఎక్కడా జరగలేదని.. స్కామ్ విషయం పుణేలో తేలిందన్నారు.
ఎలాంటి చర్చ లేకుండానే ఎంవోయూలు కుదుర్చుకున్నారని చెప్పారు. అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు కాబట్టి మేం చేశామని నాటి సీఎస్ చెప్పారని గుర్తుచేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించిందని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. కోర్టు సూచనతో ఆయనకు కావాల్సిన ఆహారం, మందులు అందుతున్నాయని చెప్పారు. చంద్రబాబు విన్నపాలను కోర్టు పరిగణనలోకి తీసుకుందన్నారు.
నేడు మూడు విడతల వాదనల అనంతరం హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోర్టులో ప్రస్తావించారు. హౌస్ రిమాండ్ అనేది ఇవ్వాలని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనల్లో భాగంగా.. గతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీం కోర్టు న్యాయవాది లుథ్రా కోర్టుకు విన్నవించారు. గౌతం నవర్కర్ కేసులో హౌజ్ రిమాండ్ కు సుప్రీం కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.