Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి ముందు తన తప్పును ఒప్పుకొని.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు నిజంగా నిజాయితీ పరుడే అయితే... కోర్టులో నిరూపించుకోవాలని సూచించారు. అలాగే రాజధానిలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగిందని, ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.


చంద్రబాబు హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ఇన్ని అక్రమాలకు పాల్పడుతూనే యుగ పురుషుడిలా చంద్రబాబు బిల్డప్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం కేబినెట్ తీసుకున్న నిర్ణయమే అయినా ప్రభుత్వాధినేతకు బాధ్యత ఉండదా అంటూ ప్రశ్నించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదని అన్నారు. అలాగే పశ్చాత్తాపం లేకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమకు ఎవరిపై రాజకీయ కక్ష లేదని.. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు. 


చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్


టీడీపీ అధినేత చంద్రబాబుపై అమరావతి రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్, ఫైబర్ నెట్ కేసులు  రాత్రికి రాత్రే పుట్టుకు వచ్చినవి కావని ఏపీ  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రతిపక్షంగా  ఉన్నప్పుడే వీటి గురించి చెప్పిందని.. రెండేళ్లుగా ఈ కేసులపై విచారణ జరుగుతోందన్నారు. అలాగే బలమైన  ఆధారాలు ఉన్నప్పుడు పిలిచి  మాట్లాడతారని చెప్పుకొచ్చారు. గతంలో జగన్ పై అక్రమ కేసులు పెట్టారని, కక్ష సాధింపు  చర్యలు చేపట్టారని ఫైర్ అయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కలపడం చంద్రబాబుకు మంచిదనని సజ్జల చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేయకపోతే నీతి పరుడిని అంటారని, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారని సజ్జల వివరించారు. 


నిన్న సైతం చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల, ఏమన్నారంటే?


చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రెండు వారాల రిమాండ్ విధించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, విచారణ చేస్తుండగా చంద్రబాబు ప్రధాన పాత్రధారి అని బలమైన సాక్ష్యాలు లభించాయన్నారు. ఈ క్రమంలోనే సాక్ష్యాధారాలతో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారని తెలిపారు. స్కిల్ స్కామ్ లో ఆయన తప్పు చేసినట్లు తేలుతుందని, చంద్రబాబుకు కచ్చితంగా శిక్ష పడుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. నేరానికి సంబంధించి సాక్ష్యాలు దొరికిన సమయంలో నిందితులు డిఫెన్స్ ధోరణిలో ఉండాలి కానీ, తమకు ఏదో అన్యాయం జరిగింది అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు. కేసు కచ్చితంగా నిరూపితమై చంద్రబాబుకు శిక్ష పడుతుందని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.