Ayodhya Ram Temple:
గోద్రా తరహా అల్లర్లు..
ఉద్దవ్ బాల్ థాక్రే (UBT) చీఫ్ ఉద్దవ్ థాక్రే అయోధ్య రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి దేశం నలు మూలల నుంచి భక్తులు తరలి వస్తారని, ఆ సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్లే సమయంలో దాడులు జరిగొచ్చని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2002లో ఫిబ్రవరి 27న అయోధ్యకి వెళ్లి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కర సేవకులపై దాడి జరిగింది. వాళ్లున్న కోచ్‌కి నిప్పంటించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అల్లర్లే ఇప్పుడూ జరుగుతుండొచ్చని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడి పుట్టించింది.
"అయోధ్యలోని రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తైంది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వేలాది మంది బస్‌లు, ట్రక్‌లలో తరలి వస్తారు. వాళ్లు వచ్చి ఇళ్లకు వెళ్లిపోయే క్రమంలో దాడులు జరిగే అవకాశముంది. మరోసారి గోద్రా తరహా అల్లర్లు జరుగుతుండొచ్చు"
- ఉద్దవ్ థాక్రే, యూబీటీ చీఫ్
బీజేపీపై ఆగ్రహం..
వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. BJP,RSSపైనా తీవ్ర విమర్శలు చేశారు ఉద్దవ్ థాక్రే. బీజేపీ సాధించింది ఏమీ లేదని, కేవలం సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెట్టినంత మాత్రాన సరిపోతుందా అని ప్రశ్నించారు. సర్దార్ పటేల్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేదని మండి పడ్డారు. ఈ విమర్శలపై బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ విమర్శించారు.
"విపక్ష కూటమి మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పని చేస్తోంది. ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు. ఎంతకైనా దిగజారుతారు. వీళ్లకు కాస్త జ్ఞానం ఇవ్వాలని ఆ రాముడిని ప్రార్థిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు సిగ్గు చేటు. పూర్తిగా ఖండిస్తున్నాం"
- రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎంపీ