Vijayawada Floods: భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులు అవుతున్నా ఇంకా ముంపు వారిని వీడటం లేదు. ప్రభుత్వం వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి పునరావాసం, బాధితులకు నిత్యవసరాలు అందివ్వడంలో బిజీగా ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలపై కూడా దృష్టి పెట్టింది. 


ఏపీలో వర్షాలకు దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు అధికారులు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత దీనిపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇస్తారు. రాష్ట్రంలోని ఇరవైకిపైగా జిల్లాలపై వర్షాల ప్రభావం ఉందని వీటిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నష్టం జరిగినట్టు గుర్తించారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు. 



వరి పంట నష్టమే ఎక్కువ


ఈ వర్షాలకు సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు లెక్కలు కట్టారు. ఇందులో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల్లోల దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పైరు నీటిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తర్వాత గోదావరి జిల్లాల్లో దాదాపు 30 వేలకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. వర్షాల వల్ల ఎకరాకు 15వేల వరకు నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలా పంటలు దెబ్బతిన్న వారిలో వరిరైతులతోపాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా ఉన్నారు. వేల ఎకరాల్లో పత్తి నీట మునిగిందని చెబుతున్నారు. వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కాకుండా చీడపీడలు కూడా చుట్టుముడతాయని అంటున్నారు. 


Also Read: వరద బీభత్సం - రైల్వే ట్రాకులు గాల్లో తేలడం, లైన్ల పునరుద్ధరణపై సీపీఆర్వో ఏమన్నారంటే!


వరదలు ధాటికి దాదాపు 70 వేల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరో రెండు లక్షల మంది ముంపులోనే కాలం వెల్లదీస్తున్నారు. కృష్ణానదికి రికార్డు స్థాయిలో 11.40 లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. 40 ఏళ్లలో ఎప్పుడూ బుడమేరుకు ఈ స్థాయి వరద రాలేదని లెక్కలు చెబుతున్నాయి. 


సాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు


వరదల కారణంగా ఏపీలో 19 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని పేర్కొంది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు రహదారులు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తోంది. ఇప్పటికే నీట మునిగిన ప్రజలు 176 పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు పేర్కొంది. వీళ్ల కోసం ప్రత్యేకంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. సహాయక చర్యల్లో 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని వివరించింది. బాధితుల కోసం 3 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ రెడీగా ఉన్నట్టు ప్రకటించింది. వీటిని అందించేందుకు బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయం తీసుకున్నట్టు తెలిపింది ప్రభుత్వం. ఇంకా ఎమర్జెన్సీ టైంలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని కూడా ప్రభుత్వం తెలిపింది. 


ఇలా భారీగా వచ్చిన వరదల కారణంగా రహదారులు, ఇళ్లు, పంటలు, ఇతర మౌలిక వసతులుపూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్నందున వారికి చేయాల్సిన సాయంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఓవైపు బాధితులకు సాయం చేస్తూనే...మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ పనులు, రహదారుల పునర్‌నిర్మాణం చేస్తోంది. 


Also Read: ఆగని వర్షాలు! నేడు కూడా కుండపోతే, ఈ జిల్లాలకు అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక