Vijayawada Rains Today: విజయవాడలో వరద బాధితులుగా ఉన్న వేల మంది ప్రజలు ఆకలితో, దాహంతో అల్లాడుతుండగా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరద ప్రాంతాలలో బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయిన ఎంతో మంది ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను అందచేస్తున్నారు. ఇలా విజయవాడ నగరంలో ఇప్పటి వరకూ రికార్డ్ స్థాయిలో దాదాపు 3 టన్నులకు పైగా ఆహార పదార్ధాలు అందజేయడం జరిగిందని ఏపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఎన్డీఆర్ఎస్ బృందాలు ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు అందచేశాయని ప్రకటించింది. మరో రెండు హెలికాఫ్టర్లు కూడా సహాయ చర్యలు ప్రారంభిస్తాయని వెల్లడించింది.
డ్రోన్ల ద్వారా ఆహారం
విజయవాడలో రోడ్లన్నీ జలమయం కావడంతో పడవలు, మర బూట్ల ద్వారానే ప్రస్తుతానికి రవాణా సాధ్యం అవుతోంది. నీటి మట్టం కాస్త తక్కువ ఉన్న చోట్ల జేసీబీలు, పొక్లెయినర్లను వాడుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని, తాగు నీటిని అందిస్తున్నారు. అయితే, సహాయ బృందాలు ఇంకా చేరుకోలేని వరద ప్రాంతాలలో డ్రోన్ ల ద్వారా ప్రజలకు ఆహారం, మంచి నీటిని అందించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం డ్రోన్ లను రెడీ చేసింది. వాటి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సులభంగా ఆహారాన్ని రవాణా చేయగలుగుతున్నారు.
చంద్రబాబు పర్యటన
విజయవాడలోని కృష్ణలంక, రాజరాజేశ్వరీపేట ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి పర్యటించారు. అక్కడి వర్ష బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నీటి మట్టాన్ని మరోసారి పరిశీలించారు. ఇటు విజయవాడలోని భవానీపురం సితారా సెంటర్ లో కూడా చంద్రబాబు నాయుడు పొక్లెయినర్ ఎక్కి పర్యటించారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీటికి కొట్టుకువచ్చిన పడవలు ఢీ కొట్టడంతో బ్యారేజ్ గేట్లకు ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి మరమ్మతులకు ఆదేశించారు.
వరద బాధితులకు వెయ్యి సోలార్ లాంతర్లు
రాష్ట్ర ఇంధన శాఖ సేకరించిన వెయ్యి సౌరశక్తి లాంతర్లను చంద్రబాబు పరిశీలించారు. వాటిని వార్డు కార్యదర్శులకు అందచేసి విజయవాడలో వరద ముంపు వల్ల విద్యుత్ సౌకర్యం లేని వారికి అందచేయాలని ఆదేశించారు. మరో 4 వేల సౌరశక్తి లాంతర్లను సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ ఎం. కమలాకరబాబు పాల్గొన్నారు.
చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లూథియానా నుంచి సైనిక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వారిని ప్రత్యేక బస్సుల్లో ముంపు ప్రాంతాలకు తీసుకువచ్చి రంగంలోకి దింపారు.
అక్కాచెల్లెళ్ల విరాళం
మరోవైపు, భారీ వర్ష బాధితులకు విరాళంగా విజయవాడకు చెందిన విజయలక్ష్మీ, నిర్మలాదేవి, రాణి అనే ముగ్గురు అక్కాచెళ్లెళ్లు ఒక్కొక్కరు రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు. వారి దాతృత్వానికి సీఎం అభినందనలు తెలిపారు.