Babu Arrest: చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేయడాన్ని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు 45 ఏళ్ల నుంచి దేశానికి సేవలందిస్తున్నారని, ఆయనను అరెస్టు చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. బాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొంటూ.. రాష్ట్రపతికి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. 


న్యాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వారికి ట్విట్టర్ వేదికగా లేఖ రాశారు కేశినేని నాని. అరెస్టు చుట్టూ ఉన్న పరిస్థితులు.. అరెస్టు చట్టబద్ధతపై, న్యాయబద్ధతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవిగా కనిపిస్తున్నాయని కేశినేని నాని తన లేఖలో తెలిపారు. అరెస్టు సమయం కూడా సందేహాస్పదంగా ఉందని అన్నారు. న్యాయం, ప్రజాస్వామ్యం సూత్రాలకు విలువనిచ్చే పౌరులుగా ఈ పరిస్థితి తీవ్రంగా బాధిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే పౌరులుగా, ఈ పరిస్థితికి బాధపడుతున్నట్లు తెలిపారు. 






ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న తమరు మీ అధికారాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించి ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బాబు అరెస్టు అంశంలో క్షుణ్ణంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 45 ఏళ్లు దేశానికి అంకితభావంతో చంద్రబాబు సేవచేశారని, ఆయన అరెస్టు పౌరుల్లో ఆందోళన కలిగిస్తోందని రాసుకొచ్చారు. 






మన ప్రజాస్వామ్య ప్రక్రియలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. న్యాయాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 






చంద్రబాబును 120(B), 166, 167, 418, 420, 468, 471, 409 సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు కేశినేని నాని తన లేఖలో పేర్కొన్నారు. అలాగే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12. 13(2) r/w 13(1) (c)&(d) 1988 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 


శనివారం ఉదయం బాబు అరెస్టు


మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వేకువజామున అరెస్టు చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 


‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి పథకాలను వివరించేందుకు మహిళలతో మాట్లాడారు. సాయంత్రానికి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. 


నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఉన్న ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. శుక్రవారం సాయంత్రం నుంచే ఆయన్ని అరెస్టు చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీన్ని టీడీపీ వర్గాలు, పోలీసులు ఖండించినప్పటికీ సైలెంట్‌గా పని కానిచ్చేశారు పోలీసులు.